Pages

Thursday, March 4, 2010



'పొగ'పెట్టకండి!
ప్రస్తుత ప్రపంచ జనాభాలో ప్రతి ఏటా దాదాపు 57 మిలియన్ల మంది మరణిస్తున్నారు. ఈ మరణాలకు దారితోస్తున్న ఎనిమిది ప్రధాన కారణాల్లో ఆరింటికి స్మోకింగ్‌ మూల హేతువుగా ఉంది. పొగతాగడాన్ని మానడం ద్వారా మరణాల శాతాన్ని గణనీయంగా తగ్గించవచ్చునన్నది వైద్యుల అభిప్రాయం. ఈ గ్రాఫిక్
'టైమ్‌' పత్రికలో ప్రచురితమైంది.
-పసుపులేటి గీత

మానెట్కి కోపం వచ్చింది!
ఒకానొక వేకువలో క్లాడ్‌ ఆస్కార్ మానెట్ తన పూదోటలో ఒక పెద్ద కాన్వాస్‌ని పెయింట్
చేయడం మొదలు పెట్టాడు. సూర్యునితో పాటు పోటీ పడుతూ మానెట్ చిత్రాన్నిపెయింట్ చేస్తున్నాడు. అలా చూస్తుండగానే సూర్యుడు శరవేగంగా పడమటి దిక్కున దాక్కున్నాడు. తాను చిత్రించిన పెయింటింగ్‌ని చూసుకుంటే, ఎక్కడా ఒక్క అసంబద్ధమైన రేఖ కూడా కనిపించలేదు మానెట్ కి! నిజానికి మానెట్కి ముందుగా కాన్వాస్‌పై డ్రాయింగ్‌ వేసుకుని పెయింటింగ్‌ ప్రారంభించే అలవాటు లేదు. ఏకంగా రంగులతోనే ఆయన తన చిత్రాన్ని ప్రారంభించేవాడు. ఆ రోజు సూర్యునితో పోటీపడుతూ ఆయన గీసిన చిత్రానికి 'ఇంప్రెషన్‌, సన్రైజ్' అని పేరు పెట్టాడు మానెట్. అదే 'ఇంప్రెషనిస్ట్‌' ఉద్యమానికి ఒక తార్కాణంగా చరిత్రలో నిలిచి పోయింది.
మానెట్ జీవితంలోని ఒక సంఘటన నాకు బాల్జాక్‌ కథ 'అన్‌నోన్‌ మాస్టర్పీస్‌'లో హీరో ఫ్రేన్హోపెర్ ని గుర్తుకు తెస్తుంది. ఈ కథలో హీరో కూడా చిత్రకారుడే. ప్రపంచమంతా పర్యటించి ఒక 'పర్ఫెక్ట్ పోట్రైట్'ని చిత్రించాలనుకుంటాడతను. ఏళ్ళూ పూళ్ళూ శ్రమించి, చిత్రాన్ని పూర్తి చేసి, తన మిత్రులకు చూపిస్తాడు. కానీ పర్ఫెక్ట్ గా వచ్చిందా, లేదా అంటూ ఫ్రేన్హోపెర్ ఆ చిత్రాన్ని పదే పదే మార్చడంతో అది దాని నిజరూపాన్ని పోగొట్టుకుని కంగాళీగా తయారవుతుంది. ఈ నిజాన్ని మిత్రులు అయిష్టంగానే ఫ్రేన్హోపెర్కి చెబుతారు. దాంతో అతను నిరాశకి లోనై, ఆ చిత్రాన్ని తగులబెట్టి, ఆత్మహత్య చేసుకుంటాడు. మానెట్లో కూడా అలాంటి 'పర్ఫెక్షనిస్టు' మనకి కనబడతాడు. నిజానికి ఎంతటి చిత్రకారునికైనా కాన్వాస్‌పై చిత్రం ఆసాంతం పూర్తయ్యాక, దానిలో చిన్న మార్పు చేయాలన్నా మనసొప్పదు. కానీ అరవై ఎనిమిదేళ్ళ వయసులో మానెట్ ఒక సాహసం చేశాడు. ఆయన మే, 1908లో ఒక చిత్ర ప్రదర్శన నిర్వహించాల్సి ఉంది. అందుకోసం మూడేళ్ల పాటు శ్రమించి మానెట్ కొన్ని పెయింటింగ్‌లు వేశాడు. ఇక గ్యాలరీలో ప్రదర్శనకు పెట్టడమే తరువాయి. ఆ క్షణంలో ఆయన చివరిగా తన చిత్రాలన్నింటినీ మరొక్కసారి నిశితంగా పరిశీలించారు. సంతృప్తిగా కనిపించలేదు. అంతే ఆ రోజుల్లోనే లక్షడాలర్ల విలువైన ఆ పెయింటింగ్‌లన్నింటినీ మానెట్ కత్తితో ధ్వంసం చేసేశాడు. దీంతో 'ఒక ఆర్టిస్టుకి తన కళాఖండాన్ని తానే ధ్వంసం చేసుకునే హక్కుందా?' అంటూ విమర్శకులు కొందరు మానెట్పై ఒంటికాలితో లేచారట. కానీ ఆయన కొంచెం కూడా రాజీ పడకుండా తాను చేసిన పనిని సమర్ధించుకున్నాడట! డబ్బు కోసం ప్రయోగశీలతకు పూర్తిగా దూరమై, వేసిన బొమ్మలే వేస్తూ మూసధోరణికి అలవాటు పడిన కొందరు కళాకారులకు మానెట్ ఉదంతం చెంపపెట్టే మరి!
-పసుపులేటి గీత