Pages

Tuesday, July 7, 2009


మహ్మద్‌ దర్వీష్
నేనక్కడి వాడినే
రిగ్గా గుర్తులేదు కానీ, ఆరోజు నేను చదివిన కవిత భావాన్ని చెబుతాను. ఒక అరబ్బు పిల్లాడు, మరో యూదు బాలునితో ఇలా అంటాడు... 'ఎండలో నీ ఇష్టం వచ్చినంత సేపు నువ్వాడుకోవచ్చు, నీ బొమ్మలు నీకుంటాయి... కానీ నాకే ఆటలూ లేవు, బొమ్మలూ లేవు/ నీకో అందమైన ఇల్లుంది, నాకు గూడే లేదు/ నీకు వేడుకలున్నాయి/ నాకేమీ లేవు, మనిద్దరం కలిసి ఎందుకాడుకోకూడదు?...' ఇందులో మీకేమైనా తప్పుగా వినిపించిందా? కానీ మిలిటరీ గవర్నర్ కి మహాపరాధమే ధ్వనించింది. నన్ను పిలిచాడు. 'ఇలాంటి రాతలే రాస్తే, మీ నాన్నని క్వారీ పనిలోంచి తీసేస్తాను...' అంటూ తర్జనితో బెదిరించాడు నన్ను. చిన్నతనంలో బడి వార్షికోత్సవం లో నేను చదివిన కవిత ఆయనకి కోపం తెప్పించింది. ఇలాంటి కవితలు రాయడం మానేయమంటూ నాకు హుకుం జారీ చేశాడు. కానీ ఇలాంటి హుకుంల నీడలో ఇరవయ్యారేళ్ళు ప్రవాసిగా, దేశబహిష్కారానికి గురై ప్రపంచాన్ని చుట్టిన నాలో మాతృదేశంపై మమకారం నానాటికీ హెచ్చిందే తప్ప తగ్గలేదు.
'నమోదు చేసుకో, నేను అరబ్బుని! నా గుర్తింపు కార్డు నెంబరు యాభైవేలు. నాకెనిమిది మంది పిల్లలు. వేసవి తరువాత తొమ్మిదోది పుట్టబోతుంది, నీకు మంటగా ఉందా? నమోదు చేసుకో, నేనొక అరబ్బుని! తోటివారితో కలిసి క్వారీలో పనిచేస్తుంటా! నాకెనిమిది మంది పిల్లలు, వాళ్ళకి తిండీ, బట్టా, పుస్తకాల్ని రాళ్ళనించే తెస్తాను! నీ గుమ్మం ముందు నుంచుని యాచించను, నీ కార్యాలయపు మెట్ల మీద నుంచుని నన్ను నేను కించపరచుకోను, అందుకే నీకు మంటగా ఉందా? నమోదు చేసుకో, నేనొక అరబ్బుని! బిరుదులూ లేని పేరొకటుంది నాకు, జనం నిప్పులు కక్కే దేశంలో నేనోర్పుగా ఉన్నా! కాలం పుట్టక ముందే, యుగాలు కళ్ళు తెరవక ముందే ఆలివ్చెట్లూ, గడ్డీ మొలవక ముందే నా వేళ్ళు దేశంలో పాతుకుపోయాయి. నా తండ్రిది నాగలిపట్టిన వంశం. వాళ్ళు ధనికులు కారు. నా తాత గాలికీ, ధూళికీ పెరిగిన పేద రైతు, వాళ్ళు నాకు ఎండపాటులోని గొప్పదనాన్ని నేర్పారు. వెదురు బొంగులతో కట్టిన గుడిసె నా ఇల్లు. నా పేదరికం నీకు తృప్తినిచ్చిందా? నమోదు చేసుకో, నేనొక అరబ్బుని! నేను, నా పిల్లలు సాగు చేసుకుంటున్న తాతముత్తాల నాటి నా తోటని నువ్వు దొంగిలించావు. రాళ్ళు తప్ప మాకేమీ మిగల్చలేదు. అందుకే మొదటి పేజీలో రాసుకో, నాకు మనుషులంటే కోపం లేదు, నేను దేన్నీ ఆక్రమించను, కానీ నాకాకలైతే మాత్రం నన్ను దోచుకున్న వాడి మాంసమే నా ఆహారం! తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త, నా ఆకలి నుంచీ, నా ఆగ్రహం నుంచీ తస్మాత్ జాగ్రత్త!' అంటూ నిప్పులు చెరగడానికి సరిహద్దులు అడ్డుకాలేదు.
'నేనక్కడి వాడినే, నాకెన్నో జ్ఞాపకాలున్నాయి. అందర్లాగే నేనూ పుట్టాను. నాకూ అమ్మ ఉంది, తోబుట్టువులూ, స్నేహితులతో పాటు బోల్డు కిటికీలున్న ఇల్లూ ఉంది, దాంతో పాటు జైలుగదీ ఉంది, దానికో చలి కిటికీ ఉంది, సముద్రపు కాకులు మోసుకొచ్చిన అలొకటి నాదగ్గరే ఉంది. ఇదంతా నాదైన సర్వదిగ్దర్శక చిత్తరువు. నాకొక పరిపూర్ణమైన మైదానముంది. నా పదానికి లోతైన దిజ్ఞ్మండలముంది. పిట్టలకి జీవనాధారమైన జాబిలొకటి నాకుంది. అనశ్వరమైన ఆలివ్వృక్షమూ ఉంది. కత్తులు మనిషిని ఎరగా మార్చకముందే నేనక్కడ నివసించాను. నేనక్కడి వాడినే. స్వర్గం తన తల్లికోసం గుక్కపట్టినప్పుడు నేను దాన్ని దాని తల్లి చేతిలో పెట్టాను. నేను దుఖిమ్చాను, నా అశ్రువుల్ని మేఘమైనా తిరిగి మోసుకొస్తుందేమోనని. నియమానికి విరుద్ధంగా రక్తవిచారణకి అవసరమైన అన్ని పదాల్నీ నేను నేర్చుకున్నాను. ఒకే ఒక్క పదం కోసం నేర్చుకున్న అన్ని పదాల్నీ ధ్వంసం చేశాను. పదమేమిటో తెలుసా, 'స్వదేశం!' పాలస్తీనా నా ప్రేయసి, ఆమెవి పాలస్తీనా కళ్లు, ఆమె పేరు పాలస్తీనియను, ఆహార్యంలోనూ, విషాదంలోనూ ఆమె పాలస్తీనీయనే, ఆమె ఆపాదమస్తకం పాలస్తీనియనే, ఆమె మాటలు, ఆమె నిశ్శబ్దం పాలస్తీనియనే, ఆమె పుట్టుకా, ఆమె చావూ పాలస్తీనియనే! ప్రేమలోంచే నేనొక 'నిరసనకారుని'గా, కవిగా ఎదిగాను.
'ఇది సుసాధ్యమే, కొన్ని సమయాల్లోనైనా ఇది సుసాధ్యమే! మరీ ముఖ్యంగా ఇప్పుడు సుసాధ్యం, జైలు గదిలో గుర్రపు స్వారీ చేస్తూ పారిపోవడం సుసాధ్యమే. అదృశ్యమవడం జైలు గోడలకు సుసాధ్యమే. జైలుగది సరిహద్దుల్లేని సుదూర సీమవుతుంది. గోడల్ని నువ్వేం చేసుకుంటావు? అందుకే వాటిని రాళ్ళకి తిరిగిచ్చేస్తాను. పైకప్పుతో నీకేం పని? దానిని నేను గుర్రపు జీనుగా మార్చేస్తాను. ఇక సంకెళ్ళు,.. నేను వాటిని తూలికలుగా మారుస్తాను. మాటలు గార్డుకి కోపాన్ని తెప్పించాయి. కవిత్వమంటే తనకి గిట్టదన్నాడు. నా జైలుగది తలుపులకి గొళ్ళెం పెట్టాడు. పొద్దుటే తిరిగి నన్ను చూడ్డానికొచ్చాడు. కోపంగా అరిచాడు, ఎక్కడివీ నీళ్ళన్నీ? నైలునది నుంచి నేనే తెచ్చానన్నాను, చెట్లూ...? డమాస్కస్తోటల్నించి తెచ్చా! సంగీతం...? నా గుండెచప్పుణ్ణుంచి తెచ్చా! గార్డుకి పిచ్చెక్కింది, నా మాటలకి కళ్ళెం బిగిస్తూ నా గది తలుపులకి గొళ్ళెం పెట్టాడు. సాయంత్రం మళ్ళీ వచ్చాడు. చంద్రుడెక్కడి నుంచొచ్చాడని అడిగాడు. బాగ్దాద్రాత్రుల నుంచి అన్నాను. మధువు...? అల్జీర్స్ ద్రాక్షతోటల్నుంచి! స్వేచ్ఛ...? రాత్రి నువ్వు నాకు బిగించిన సంకెల నుంచి! గార్డు దుఖితుడయ్యాడు. తన స్వేచ్ఛని తనకిమ్మని అతను ప్రాధేయపడ్డాడు.' నా 'జైలుగది' పాలస్తీనా ప్రజల గుండెల్లో నిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉంది.
నా పాలస్తీన్లిబరేషన్ఆర్గనైజేషన్మిత్రుల్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఓస్లో ఒప్పందాన్ని వ్యతిరేకించకుండా ఉండలేని నా పట్టుదలలోంచి వాళ్ళనిలా ప్రశ్నిస్తున్నాను. సమున్నతమైన శిఖరాల్నుంచీ ఇలా అగాధాల్లోకి మనం జారిపడక తప్పదా?! మనం దేవతలం కామని తెలుసుకోవడానికి మన చేతులకీ రక్తపు మరకలంటక తప్పదా? మన నిజస్వరూపం కన్యాత్వాన్ని కోల్పోయిందని చెప్పడానికి మనం మన మర్మావయాల్ని లోకం ముందు ప్రదర్శించక తప్పదా? 'మేం ప్రత్యేకమైన వాళ్ళం' అని ఎప్పుడైతే మనం చెబుతామో అప్పుడు మనను మించిన అబద్దాలకోరులుండరు. ఇతరులకు అసత్యం చెప్పడం, నీ మీద నీకు అర్థరహితమైన నమ్మకాన్ని కలిగి ఉండడం ఒక్కటే! మనల్ని ద్వేషించే వారిని ప్రేమించడం, మనల్ని ప్రేమించే వారిని ద్వేషించడం..., దీనికన్నా అవివేకం మరొకటుందా?!
గతమా మమ్మల్ని మార్చొద్దు, నీనుంచి మేమెప్పుడో దూరంగా పారిపోయాం. మీరెవరు, నానుంచి మీకేం కావాలి అని భవితవ్యమా మమ్మల్ని ప్రశ్నించొద్దు. మాకేం కావాలో మాకే తెలియదు కాబట్టి. వర్తమానమా, మమ్మల్ని కాస్త భరించు, ఎందుకంటే మేం కేవలం బావురుమంటూ దారిన పోయే దరిద్రులం కాబట్టి! అస్థిత్వమనేది మనకు వారసత్వంగా సంక్రమించలేదు, మరణశాసనం ద్వారానే దాన్ని పొందాం. మన ముఖం మనకు అందంగా కనిపించగానే చేజేతులా మనమే పగలగొట్టుకున్న అద్దం మన అస్థిత్వం! నువ్వెంత సేపైనా నా కళ్ళలోకి సూటిగా చూడు, అక్కడ నీకు నా చూపు దొరకదు. ఎందుకంటే ఒక వదంతి దాన్ని దొంగిలించేసింది. నా హృదయం నాది కాదు, అది ఎవరిదీ కాదు. శిలగా మారకుండానే అది స్వాతంత్య్రాన్ని ప్రకటించుకుంది. ఖైదీ కారాగారాన్ని చేరడానికి తాపత్రయ పడుతున్నాడు, తన విజయ హాసాన్ని కెమెరాల కళ్ళనించి దాచేస్తున్నాడు. కానీ అతని కళ్ళు ఆనందాన్ని దాచిపెట్టలేక పోతున్నాయి, పాలస్తీనీయన్లుగా ఉన్నంతకాలం మనం స్వకాముకులం ఎందుక్కావాలి? 'నా బంధువుపై దాడికి నేనూ, ఆగంతుకుడూ సైన్యంలో కలుస్తాం, నా సోదరునిపై దాడికి నా బంధువూ, నేనూ సైన్యంలో చేరతాం. నా మీద దాడికి నేనూ, నా షేకూ సైన్యంలో కలుస్తాం'- జాతీయ విద్యా ప్రమాణాల్లో ఇదే తొలిపాటం. శత్రువు తూటాల వల్ల మరణించిన వాడా, తన సోదరుని తూటాల వల్ల మరణించిన వాడా..., అగాదాల చీకట్లో పడి స్వర్గానికి ముందుగా ఎవరు చేరుకుంటారు? నీ తల్లి గర్భం నుంచే నీ శత్రువు పుడతాడని ధర్మకోవిదులు కొందరంటారు. సంప్రదాయవాదులు నన్ను చిరాకు పెట్టరు. వారి లౌకికవాద సానుభూతిపరులు మాత్రం నన్ను చికాకు పరుస్తున్నారు. వారి నాస్తికవాద సానుభూతిపరుల్లాగే చికాకు పరుస్తున్నారు. నా అస్థిత్వానికి నేను అవమాన పడడం లేదు. ఎందుకంటే అదింకా నిర్మాణంలో ఉంది.
'అనిత్యమైన పదాల వెంటపడి పోతున్నవాళ్ళంతా వినండి, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోయే తరుణమొచ్చింది. ఎక్కడికైనా వెళ్ళి ఉండండి, మామధ్య మాత్రం వద్దు, మీరు వెళ్ళి పోయే సమయమొచ్చింది, ఎక్కడికైనా వెళ్ళి చావండి, మా మధ్య మాత్రం చావొద్దు!' ఇలా నేనన్నప్పుడు అందరూ నన్నొక దోషిగా చూశారు. పాలస్తీనా మెయిన్స్ట్రీమ్రాజకీయాల్ని సమర్థిస్తున్నానన్న అపప్రదని నేను మోశాను. కానీ నేను అపవాదులకీ జంకను. 'చెల్లెలా, నా గొంతులో కన్నీళ్ళున్నాయి, నా కళ్ళలో నిప్పులున్నాయి, నేను స్వతంత్రుణ్ణి! సుల్తాను ద్వారం ముందు నేను నిరసన తెలుపనక్కర్లేదు. ఇదివరకే మరణించిన వారంతా, రేపవల ద్వారం ముందు ఇకపై మరణించబోయే వారంతా నన్ను కౌగిలించుకున్నారు, నేనిప్పుడు వారి ఆయుధాన్ని!'
శత్రువును కూడా మానవీకరించే పనిని నేనాపను. నాకు హీబ్రూ నేర్పిన తొలిగురువు ఒక యూదు వ్యక్తి. నా జీవితంలో తొలిప్రేమపాదును చిగురింపజేసింది ఒక యూదు యువతే. నన్ను జైలుకు పంపిన తొలి న్యాయమూర్తి కూడా ఒక యూదు వనితే. అందుకే ఆది నుంచీ యూదుల్ని నేను దెయ్యాలుగానో, దేవతలుగానో చూళ్ళేదు, వాళ్ళని కేవలం నాలాంటి మనుషులుగానే చూశాను. యూదుల కోసం నేనెన్నో కవితలు రాశాను. వాటిలో ప్రేమ పార్శ్వాన్ని తప్ప యుద్ధ మూలాల్ని చర్చించలేదు.
గలీలీలోని అల్బిర్వాలో పుట్టాన్నేను. నాకప్పుడు ఏడేళ్ళు, ఇజ్రేలీ సైన్యం పాలస్తీనాపై సామూహిక హత్యాకాండకు పూనుకుంది. దాంట్లో భాగంగానే మా గ్రామాన్ని సైన్యం ధ్వంసం చేసింది. మా గ్రామాన్నే కాదు మరో నాలుగు వందల గ్రామాల్ని బుగ్గి చేసింది. మా కుటుంబం బతుకుజీవుడా అంటూ లెబనాన్కు పారిపోయింది. కానీ పుట్టినగడ్డ మీద మమకారం చావక దొంగతనంగా మా గ్రామానికి తిరిగి వచ్చాం. అప్పట్నుంచీ సైనిక పాలన కింద సొంత ఊరిలోనే పరాయివాళ్ళంగా బతికాం. ఇదిగో పరాయీకరణే నాకు మాతృదేశపు విలువను తెలియజెప్పింది. ఇందాక చెప్పిన 'రాతల'వల్ల నేను సైనిక పాలనలో చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వచ్చింది. హింస 1950 నుంచీ 1970 వరకూ అంటే నేను పైచదువుల కోసం రష్యాకు వెళ్ళేంత వరకు నిరాటంకంగా సాగింది. అక్కడి నుంచీ ఈజిప్టుకీ, ఈజిప్టు నుంచి బీరట్ కి, మళ్ళీ బీరట్ నుంచి అరబ్బు దేశాల రాజధానులన్నింటినీ చుట్టి వచ్చి, పారిస్లో కొంతకాలమున్న తరువాత రమల్లాలో స్థిరపడ్డాను. అది కూడా నా జన్మభూమికి కొంత దూరంలోనే. 'నా ఆద్యంతాల్ని కలపడానికి ఆయువు సరిపోవట్లేదు..'! నిద్రంటే శాంతి, నిద్రంటే స్వప్నం, స్వప్నం నుంచి జనించేదే సుషుప్తి! పాలస్తీనియన్పిల్లలంతా నా కవితల్ని తమ కవితలుగా ప్రకటించుకునే రోజును స్వప్నిస్తూ..., ప్రవాసుల, దేశబహిష్కృతుల కన్నీళ్ళతో తడవని నేలని కలగంటూ ఎన్నటికీ సెలవడగని మీ దర్వీష్‌.
-పసుపులేటి గీత

(పాలస్తీనియన్‌ జాతీయ కవి మహ్మద్‌ దర్వీష్‌ 13, మార్చి, 1941న పాలస్తీనాలోని అల్బిర్వాకి చెందిన గలీలి అనే గ్రామంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు. ఇజ్రాయిల్ సైన్యం పాలస్తీనాను ఆక్రమించిన తరువాత వీరి కుటుంబం లెబనాన్‌కు పారిపోయింది. తరువాత స్వగ్రామానికి తిరిగి వచ్చినా శరణార్థుల్లా జీవించాల్సి వచ్చింది. చిన్నతనంలోనే దర్వీష్‌పై ఈ పరాయీకరణ ప్రభావం పడింది. యవ్వన తొలినాళ్ళలోనే ఆయన అరబ్బుల అస్థిత్వాన్ని ప్రకటిస్తూ చేసిన రచనల ఫలితంగా దేశ బహిష్కారానికి గురికావలసి వచ్చింది. ఇజ్రేలీ కమ్యూనిస్ట్‌ పార్టీ 'రఖా'లో ఆయన సభ్యులుగా ఉండేవారు. తరువాత పాలస్తీన్‌ లిబరేషన్‌ ఆర్గనైజేషన్‌ (పిఎల్వో)లో సభ్యత్వం స్వీకరించారు. దర్వీష్‌ 1993లో కుదిరిన ఓస్లో ఒప్పందంపై విముఖతతో పిఎల్వోకి రాజీనామా చేశారు. ఆయన ముప్ఫైకి పైగా కవితా సంపుటులు వెలువరించారు. పలు అంతర్జాతీయ పురస్కారాల్ని పొందారు. దర్వీష్‌ 9, ఆగస్ట్‌, 2008న గుండెకి శస్త్రచికిత్స జరిగిన తరువాత మరణించారు.)