Pages

Sunday, March 7, 2010



'ఉమెన్స్ డే'
హిళా దినోత్సవమంటే ఏమిటి? ఇలాంటిదొకటి నిజంగా అవసరమా? ఇది బూర్జువా వర్గానికి చెందిన మహిళలకు, స్త్రీవాదులకు ఒక సాకుగా మారుతుందా? కార్మిక ఉద్యమ సమైక్యతకు ఇది గొడ్డలిపెట్టుగా మారుతుందా?
ఇలాంటి ఎన్నెన్నో ప్రశ్నలు, ఇతర దేశాల్లో పెద్దగా వినిపించక పోయినప్పటికీ, రష్యాలో ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నింటికీ జీవితం ఈసరికే ఒక స్పష్టమైన జవాబు ఇచ్చేసింది. మహిళా దినోత్సవమన్నది స్త్రీల సుదీర్ఘ ప్రజాస్వామిక పోరాటమనే గొలుసులోని ఒక ప్రధానమైన లంకె. ప్రతి ఏటా శ్రామిక మహిళల తాలూకు వ్యవస్థీకృత సైన్యం బలం పుంజుకుంటూనే ఉంది. శ్రామికుల పార్టీలో ఇరవయ్యేళ్ళ క్రితం వరకు శ్రామిక మహిళలు అక్కడక్కడా విసిరేసినట్టుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆంగ్లేయుల శ్రామిక సమాఖ్యల్లో 292 వేల మంది, జర్మనీలో 200 వేల మంది మహిళలు సభ్యులుగాను, కార్మికోద్యమ కార్యకర్తలుగాను ఉన్నారు. ఆస్ట్రియాలో 47 వేల మంది ట్రేడ్‌యూనియన్‌ సభ్యులుగాను, 20 వేల మంది పార్టీ సభ్యులుగాను ఉన్నారు. ఇటలీ, హంగరీ, డెన్మార్క్, స్వీడన్‌, నార్వే, స్టిట్జర్లాండ్‌లలో శ్రామిక వర్గ మహిళలు సమైక్యమవుతున్నారు. మహిళా సోషలిస్టు సైన్యం ఒక అజేయమైన శక్తిగా రూపుదిద్దుకుంటోంది. జీవన ప్రమాణాలు, ప్రసూతి భీమా, బాలకార్మికులు, మహిళా శ్రామికుల హక్కుల పరిరక్షణ వంటి ఎన్నో విషయాల్లో ఆ సైన్యం ప్రపంచానికి ఒక నూతనోత్తేజంగా నిలిచింది.
పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా జరిపే పోరాటాన్ని కేవలం తమ భుజస్కంధాల పైనే మోయాల్సి ఉంటుందని శ్రామిక వర్గ పురుషులు ఒకానొక కాలంలో భావించే వారు. ఈ సనాతన వ్యవస్థతో జరిపే పోరాటంలో తమ స్త్రీల సహకారం ఉండదని వారు అభిప్రాయ పడేవారు. కానీ మహిళలు భర్త లేదా తండ్రి నిరుద్యోగి అయినప్పుడు, గత్యంతరం లేని పరిస్థితుల్లో తమ శ్రమ శక్తిని మార్కెట్లో పెట్టడానికి ముందుకొచ్చినపుడు, మహిళల్లో వర్గస్పృహ లోపించడం వల్ల కార్మికోద్యమానికి ఎంతటి నష్టం వాటిల్లుతుందో శ్రామిక పురుషులకు అర్థమైంది. అవగాహన పెరిగిన వ్యక్తుల సంఖ్య పెరిగే కొద్దీ ఉద్యమానికి విజయం దగ్గరవుతుందన్నది బోధపడింది. అయితే పొయ్యి దగ్గర కూర్చున్న మహిళకి, సమాజంలోను, కుటుంబంలోను ఎలాంటి హక్కులూ లేని మహిళకి అవగాహన ఎలా పెరుగుతుంది? భర్త, తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ, తమకంటూ వ్యక్తిత్వం లేని మహిళల నుంచి ఏమాశించగలం?
స్త్రీలలోని ఈ వెనుకబాటుతనం, హక్కుల లేమి శ్రామికవర్గ పోరాటానికి అవరోధంగా మారుతాయి. కానీ మహిళా కార్మికురాల్ని ఉద్యమంలోకి తెచ్చేదెలా? ఆమెలో ఉద్యమస్ఫూర్తిని కలిగించడమెలా? ఇతర దేశాల్లో ఈ సమస్యలకి పరిష్కారం అంత సులభంగా లభించలేదు. మహిళల కోసం కార్మిక సంస్థల్ని ప్రారంభించినప్పటికీ తొలుత వాటికి అంతగా స్పందన దొరకలేదు. ఎందుకంటే శతాబ్దాలుగా శ్రామికవర్గంలో అట్టడుగు స్థాయిలో ఉన్న మహిళలో హృదయ చైతన్యం తేవడం అంత సులభమేమీ కాదు. మహిళల స్థితిని అర్ధం చేసుకోవడంలో కార్మిక ఉద్యమం కూడా తొలిరోజుల్లో సఫలం కాలేదు. ఈ మహిళల్లో చైతన్యం కలిగించాలంటే ఒక ప్రత్యేక సరళి అవసరం. మహిళ శ్రమదోపిడీకే కాక, తల్లిగాను, స్త్రీగాను అణచివేతకు గురవుతున్న వైనాన్ని పురుష కార్మికులే అర్థం చేసుకోలేక పోయారు. కానీ ఎప్పుడైతే కార్మిక సోషలిస్టు పార్టీ ఈ విషయాన్ని అర్థం చేసుకుందో ఆ క్షణం నుంచే మహిళకి ఒక తల్లిగాను, స్త్రీగాను, కార్మికురాలిగాను ఉన్న హక్కుల్ని పరిరక్షించడంపై దృష్టి కేంద్రీకరించింది. స్త్రీల శ్రమకి, మాతాశిశు సంరక్షణకి, స్త్రీల రాజకీయ హక్కులకి ప్రత్యేక రక్షణ కల్పించాలని ప్రతి దేశంలోనూ సోషలిస్టులు ముక్త కంఠంతో డిమాండ్‌ చేశారు.
ఎప్పుడైతే కార్మిక పార్టీ ఈ విషయాన్ని గుర్తించిందన్న అవగాహన కలిగిందో శ్రామిక స్త్రీలు కూడా ఉద్యమంలో చేరడానికి ఉద్యుక్తులయ్యారు. శ్రామిక వర్గ పోరాటం తమ హక్కుల పరిరక్షణలో భాగంగా ఆ స్త్రీలు భావించారు. దాంతో శ్రామిక వర్గ మహిళలు సంఘటితమవడం మొదలైంది. ఇప్పుడు సోషలిస్టు ఉద్యమంలోకి ఎక్కువ మంది స్త్రీలని ఆకర్షించే బాధ్యత ఇలాంటి మహిళలపై పడింది. ప్రతిదేశంలోనూ పార్టీ ప్రత్యేకమైన మహిళా సంఘాల్ని స్థాపించి, రాజకీయ అవగాహనలేని మహిళల్ని సమీకరించి, వారిలో ఉద్యమ స్ఫూర్తిని పెంచే ప్రయత్నం చేశాయి. గర్భవతులు, తల్లుల సంరక్షణ, మహిళల శ్రమకి చట్టపరమైన భద్రత, వ్యభిచారానికి, శిశు మరణాలకి వ్యతిరేకంగా ఉద్యమించడం, రాజకీయ హక్కుల కోసం డిమాండ్‌ చేయడం, పెరుగుతున్న ధరల్ని అరికట్టడం, నివాస సదుపాయాల్ని అభివృద్ధి చేయడం వంటి అంశాలపై మహిళా సంఘాలతో పాటు, పార్టీ కూడా దృష్టి పెట్టాల్సి వచ్చింది.
ఆ విధంగా మహిళలు తమ వర్గ ప్రయోజనాల కోసం పార్టీ సభ్యులుగాను, కార్మికులుగాను పోరాడాల్సి వచ్చింది. పార్టీ కూడా వీళ్ళ డిమాండ్లకి మద్దతు తెలిపింది. కార్మిక మహిళలు కూడా శ్రామిక వర్గ ఉద్యమంలో ఒక కీలకమైన భూమికగా గుర్తింపు పొందారు. వీరి అవసరాలన్నీ ఉద్యమంలో ఒక భాగంగా మారాయి.
మహిళా దినోత్సవం రోజున హక్కుల పోరాటంలో భాగంగా ఇలాంటి మహిళలంతా ఏకమవుతారు. కానీ కొందరు 'ఇలా ప్రత్యేకంగా మహిళా దినోత్సవాలెందుకు?', 'శ్రామిక మహిళల కోసం ప్రత్యేకంగా కరపత్రాలెందుకు? సమావేశాలెందుకు?' అని ప్రశ్నించవచ్చు. ఇదంతా బూర్జువా వర్గానికి, స్త్రీవాదులకి ఒక అవకాశాన్ని కలిగించినట్టవదా? అన్నది ఆ ప్రశ్నలో ధ్వనించే భయం.
బూర్జువా వర్గ మహిళలకి, శ్రామిక వర్గ మహిళల ఉద్యమానికి మధ్య తేడాని తెలుసుకోలేని కొందరు మాత్రమే ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
స్త్రీవాదుల లక్ష్యమేమిటి? పెట్టుబడిదారీ సమాజంలో తమ భర్తలు అనుభవిస్తున్న హక్కులు, అవకాశాల్ని తామూ పొందాలన్నదే వారి లక్ష్యం. సంపద లేదా పుట్టుక ద్వారా పురుషులకు సంక్రమిస్తున్న అన్ని అవకాశాల్ని రూపుమాపాలని, తద్వారా వివక్షని అంతం చేయాలన్నది వారి ఉద్దేశం. శ్రామిక మహిళల విషయానికి వస్తే ఆధిపత్యం స్త్రీదా, పురుషునిదా? అన్నది సమస్యే కాదు. తన వర్గంలో తానొక కార్మికురాలిగా గుర్తింపు పొందాలని శ్రామిక మహిళ కోరుకుంటుంది. స్త్రీవాదులు ప్రతిచోటా, ప్రతి విషయంలోనూ సమాన హక్కుల కోసం డిమాండ్‌ చేస్తున్నారు. కానీ ఈ డిమాండ్‌కి శ్రామిక మహిళల జవాబు వేరుగా ఉంటుంది. 'ప్రతి పౌరునికీ, స్త్రీ పురుషులందరికీ సమాన హక్కులు కావాలి. అదే సందర్భంలో మేము కేవలం కార్మిక స్త్రీలం మాత్రమే కాదు, మేం తల్లులమన్న విషయాన్ని కూడా గుర్తుంచుకుంటాం! తల్లిగా మహిళ భవిష్యత్తుకు జన్మనిస్తుంది. రాజ్యం నుంచి, సమాజం నుంచీ మాకూ, మా పిల్లలకూ ప్రత్యేక హక్కులు కావాలని మేం డిమాండ్‌ చేస్తున్నాం.'
'స్త్రీవాదులు రాజకీయ హక్కుల కోసం పోరాడుతున్నారు. ఈ విషయంలోనూ మా దారులు వేరుగానే ఉన్నాయి.'
బూర్జువా స్త్రీలు కోరుకుంటున్న రాజకీయ హక్కులు, శ్రామికుల్ని దోపిడీ చేస్తున్న పెట్టుబడిదారీ వ్యవస్థలో పురుషులతో సమానావకాశాలకు సంబంధించినవి. శ్రామిక మహిళలు కోరుతున్న రాజకీయహక్కులు ప్రవర్ధమాన శ్రామిక వర్గ ప్రపంచానికి దారులు పరిచేవి. అందుకే బూర్జువా మహిళల, శ్రామిక మహిళల దారులు ఎప్పటికీ కలవవు. యజమానురాలికీ, ఆమె సేవకురాలికీ మధ్య ఎంత తేడా ఉందో బూర్జువా మహిళలు, శ్రామిక మహిళల ప్రయోజనాలకీ అంతే తేడా ఉంది. అందుకే శ్రామిక వర్గ పురుషులు ఈ మహిళా దినోత్సవాలపై ఎలాంటి అపోహల్ని పెట్టుకోరాదు.
సమష్టి ప్రయోజన సాధనలో తమ మహిళల చైతన్యానికీ, అభివృద్ధికీ కొత్తదారులు పరిచేలా వారిని ప్రోత్సహించి, ఒక ఆనందభరిత సందర్భాన్ని మహిళా దినోత్సవంగా జరుపుకునేలా పురుషులు కూడా కలిసి రావాలి.
మూలం : అలెగ్జాండ్రా కొలెన్టాయ్
అనువాదం : పసుపులేటి గీత
(అలెగ్జాండ్రా కొలెన్టాయ్ రాసిన 'ఉమెన్స్ డే' అనే వ్యాసం 'ప్రావ్దా' పత్రికలో 23, ఫిబ్రవరి, 1913న ప్రచురితమైంది. ఆ వ్యాసానికి సంక్షిప్తానువాదమే ఇది)

Saturday, March 6, 2010

DARFUR REFUGEE WOMEN SPEAK OUT: Risking Life For Human Rights




more about "DARFUR REFUGEE WOMEN SPEAK OUT: Riski...", posted with vodpod

Thursday, March 4, 2010



'పొగ'పెట్టకండి!
ప్రస్తుత ప్రపంచ జనాభాలో ప్రతి ఏటా దాదాపు 57 మిలియన్ల మంది మరణిస్తున్నారు. ఈ మరణాలకు దారితోస్తున్న ఎనిమిది ప్రధాన కారణాల్లో ఆరింటికి స్మోకింగ్‌ మూల హేతువుగా ఉంది. పొగతాగడాన్ని మానడం ద్వారా మరణాల శాతాన్ని గణనీయంగా తగ్గించవచ్చునన్నది వైద్యుల అభిప్రాయం. ఈ గ్రాఫిక్
'టైమ్‌' పత్రికలో ప్రచురితమైంది.
-పసుపులేటి గీత

మానెట్కి కోపం వచ్చింది!
ఒకానొక వేకువలో క్లాడ్‌ ఆస్కార్ మానెట్ తన పూదోటలో ఒక పెద్ద కాన్వాస్‌ని పెయింట్
చేయడం మొదలు పెట్టాడు. సూర్యునితో పాటు పోటీ పడుతూ మానెట్ చిత్రాన్నిపెయింట్ చేస్తున్నాడు. అలా చూస్తుండగానే సూర్యుడు శరవేగంగా పడమటి దిక్కున దాక్కున్నాడు. తాను చిత్రించిన పెయింటింగ్‌ని చూసుకుంటే, ఎక్కడా ఒక్క అసంబద్ధమైన రేఖ కూడా కనిపించలేదు మానెట్ కి! నిజానికి మానెట్కి ముందుగా కాన్వాస్‌పై డ్రాయింగ్‌ వేసుకుని పెయింటింగ్‌ ప్రారంభించే అలవాటు లేదు. ఏకంగా రంగులతోనే ఆయన తన చిత్రాన్ని ప్రారంభించేవాడు. ఆ రోజు సూర్యునితో పోటీపడుతూ ఆయన గీసిన చిత్రానికి 'ఇంప్రెషన్‌, సన్రైజ్' అని పేరు పెట్టాడు మానెట్. అదే 'ఇంప్రెషనిస్ట్‌' ఉద్యమానికి ఒక తార్కాణంగా చరిత్రలో నిలిచి పోయింది.
మానెట్ జీవితంలోని ఒక సంఘటన నాకు బాల్జాక్‌ కథ 'అన్‌నోన్‌ మాస్టర్పీస్‌'లో హీరో ఫ్రేన్హోపెర్ ని గుర్తుకు తెస్తుంది. ఈ కథలో హీరో కూడా చిత్రకారుడే. ప్రపంచమంతా పర్యటించి ఒక 'పర్ఫెక్ట్ పోట్రైట్'ని చిత్రించాలనుకుంటాడతను. ఏళ్ళూ పూళ్ళూ శ్రమించి, చిత్రాన్ని పూర్తి చేసి, తన మిత్రులకు చూపిస్తాడు. కానీ పర్ఫెక్ట్ గా వచ్చిందా, లేదా అంటూ ఫ్రేన్హోపెర్ ఆ చిత్రాన్ని పదే పదే మార్చడంతో అది దాని నిజరూపాన్ని పోగొట్టుకుని కంగాళీగా తయారవుతుంది. ఈ నిజాన్ని మిత్రులు అయిష్టంగానే ఫ్రేన్హోపెర్కి చెబుతారు. దాంతో అతను నిరాశకి లోనై, ఆ చిత్రాన్ని తగులబెట్టి, ఆత్మహత్య చేసుకుంటాడు. మానెట్లో కూడా అలాంటి 'పర్ఫెక్షనిస్టు' మనకి కనబడతాడు. నిజానికి ఎంతటి చిత్రకారునికైనా కాన్వాస్‌పై చిత్రం ఆసాంతం పూర్తయ్యాక, దానిలో చిన్న మార్పు చేయాలన్నా మనసొప్పదు. కానీ అరవై ఎనిమిదేళ్ళ వయసులో మానెట్ ఒక సాహసం చేశాడు. ఆయన మే, 1908లో ఒక చిత్ర ప్రదర్శన నిర్వహించాల్సి ఉంది. అందుకోసం మూడేళ్ల పాటు శ్రమించి మానెట్ కొన్ని పెయింటింగ్‌లు వేశాడు. ఇక గ్యాలరీలో ప్రదర్శనకు పెట్టడమే తరువాయి. ఆ క్షణంలో ఆయన చివరిగా తన చిత్రాలన్నింటినీ మరొక్కసారి నిశితంగా పరిశీలించారు. సంతృప్తిగా కనిపించలేదు. అంతే ఆ రోజుల్లోనే లక్షడాలర్ల విలువైన ఆ పెయింటింగ్‌లన్నింటినీ మానెట్ కత్తితో ధ్వంసం చేసేశాడు. దీంతో 'ఒక ఆర్టిస్టుకి తన కళాఖండాన్ని తానే ధ్వంసం చేసుకునే హక్కుందా?' అంటూ విమర్శకులు కొందరు మానెట్పై ఒంటికాలితో లేచారట. కానీ ఆయన కొంచెం కూడా రాజీ పడకుండా తాను చేసిన పనిని సమర్ధించుకున్నాడట! డబ్బు కోసం ప్రయోగశీలతకు పూర్తిగా దూరమై, వేసిన బొమ్మలే వేస్తూ మూసధోరణికి అలవాటు పడిన కొందరు కళాకారులకు మానెట్ ఉదంతం చెంపపెట్టే మరి!
-పసుపులేటి గీత

Tuesday, March 2, 2010

(via sunshinemusings)

(via sunshinemusings): "

(via sunshinemusings)

"