Pages

Monday, February 22, 2010


చినుకుల గొడుగు
'వేసవి నాటి ధూళిదుమారాన్ని గుర్తు చేస్తుంది నాకు తొలకరి చినుకు, ఈ చినుకుకు నిరుటి జ్ఞాపకాలేవీ లేవు, ఏడాదంటే గతం తాలూకు ఏ గుర్తుల్నీ మననం చేసుకోలేని విధంగా తర్ఫీదు పొందిన జంతు'వంటాడు ఇజ్రేలీ కవి యెహుదా అమిచా. సరిగ్గా అలాగే ఈ చినుకు ఏ జ్ఞాపకాల తడి అంటని పాలిథిన్ కవరులా నా ముఖాన్ని కమ్ముకుని ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
దారుల మీద శృతి తప్పని చక్రాల జలతరంగిణి, వాహనాలపై వానచినుకుల మాఘమల్హారం. ఫుట్పాత్ నదిలోకి తర్జుమా అవుతోంది. నడిరోడ్డు మీద సముద్రం ఒళ్ళువిరుచుకుంటోంది. డ్రైవర్లు స్టీరింగు పట్టుకున్న సరంగులే అయ్యారు. వంగిన నడుం మీద ఎడమచేతి నుంచి, కుడిచేత్తో ఎదురుగాలిని అదిలిస్తూ, పట్టుతప్పుతున్న కాలిమడమల్ని మందలిస్తూ, వయోభారపు విన్యాసాలకి ఒళ్ళప్పగించిన ఒకానొక ముసలావిడ ఆటోచక్రాల ఆకతాయితనాన్ని తిట్టుకుంటోంది. పిడికిట్లో ముద్దకట్టిన చద్దన్నంలా చలికి వజవజలాడుతున్న ఆమె పాదాల కింద ఏ మాన్హోల్ నోరు తెరచుకుందో, వానంటే నేల మీద నడిచే కృష్ణబిలం. మనిషి లోపలి మనిషిలా, మనిషి లోపలి మబ్బులా నల్లటి చిక్కటి చీకటి వాన, ఏ పేదగుడిసెని ఊడ్చుకు పోవడానికో కన్ను తెరచిన పెనుతుపాను కూనలాంటి చినుకు, వానొస్తే కూలిదొరక్క పస్తులతో ముడుచుకుని పడుకునే బడుగుల ఆకలి కేకల గొంతుని చల్లగా నులిమే హంతకురాల్లాంటి చినుకు, చీకటంటే అర్థం కాని పసి పిల్లల గుండెల్లో ఒంటరితనపు సుడిగుండమై గుక్క పట్టే చినుకు,... అయితేనేం, వరిమళ్ళలో పరమాన్నపు పలవరింతై పులకలెత్తేందుకు పరుగులెత్తుతున్నదీ ఈ చినుకేగా!
చూరుల నుంచి కిందికి జారుతున్న చినుకు, కిందికే జారుతున్న చినుకు..., ప్రతిసారీ అపరిచిత నేస్తంలా పలకరించే చినుకు ఎప్పట్లాగే కిందికే జారుతోంది. పారిపోయేందుకు అవకాశంలేని ఖైదీల్లా వాన తెరల నడుమ రోడ్డు పక్కన చెట్లు. వాటి నీడల తలుపుల్ని తడుతూ, తడుపుతూ, చినుకు..., తలుపు తట్టిన చప్పుడైతే రెమ్మల్ని తెరిచి చూశాయి ఆకులు, ఎదురుగా చినుకు రాలుతోంది. 'అరెరె, కిందపడి పోతోంది, పట్టుకోండి...' అంటూ ఆతృతగా గలగలలాడాయవి! అలికిడికి చుట్టూ ఉన్న చెట్లన్నీ చినుకుపిట్టకి కొమ్మలందించబోయాయి, అయినా కిందికి జారడమే తప్ప, తీగలా పైకల్లుకోవడమెలాగో తెలీలేదు దానికి. చెట్లు చిన్నబోయి తలలు వాల్చాయి. కాలం కూడా ఇంతే, గుప్పెట్లో ఇమడదు. చినుకు జారుతూనే ఉంది, ఇంకెంత సేపు జారాలోనన్న బెంగలేదు, కిందపడి పోతానన్న బెదురు లేదు. రెక్కలున్న ప్రతిదీ పైకే ఎగరాలని ఎవరు చెప్పారు...? అంటూ చినుకు నావైపు క్షణమాత్రం సాలోచనగా చూసింది. ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు? ఉన్నత శిఖరాలు, ఉన్నత లక్ష్యాలు, ఉన్నత జీవన ప్రమాణాలు,... అంతా ఉన్నతంగానే ఉండాలని సమాజం నిర్దేశించింది కనుక 'పైకి, పైపైకి...' అన్నదే జీవన సూత్రమైంది. ఈ చినుకు పిట్టని చూశాకే తెలిసింది, పైకెగరడానికి రెక్కలే కావలసి వస్తే, కిందికి జారడానికీ రెక్కలుండాలని! గాలి రెక్కలల్లారుస్తూ చినుకుపిట్ట కిందికి ఎగురుతోంది. ఏదైనా కింద పడిపోతే, 'అరెరే..' అంటూ బాధపడిపోయే మనస్తత్వాన్ని సమాజం నుంచి నేనూ అందిపుచ్చుకున్నాను. అందుకే అప్రయత్నంగా అరచేయి అడ్డు పెట్టి చినుకునడ్డగించాను. అరచేతిలో రాలిన ఒక చినుకు, పది చినుకులై చింది, నన్ను పరిహసిస్తూ, వేళ్ళ సందుల్లోంచి మళ్ళీ జారిపోయింది. చినుకంటే పడిపోవడమే, నేలమీద పతనమై, వాగుగా, వంకగా పరుగులెత్తడమే,... మొలకగా చివుళ్ళెత్తి, ఏపుగా పైకి ఎదగడమే. పడిపోవడమంటే మళ్ళీ నిలుచోవడమే. చినుకంటే వరదగా అంతటినీ తుడిచేయడమే, ఒండ్రుగా నేలని సారవంతం చేయడమే. చినుకంటే సేద్యం, చినుకంటే ఫలసాయం, చినుకంటే ఉప్పెన, చినుకంటే ఉపద్రవం, చినుకంటే ఒకచోట బతుకును ముంచేసి, కాల్చేసే నీటి నిప్పు, మరోచోట పిడికెడు ముద్దయి, ఆకలి నిప్పునార్పే నీటి విత్తనం. చినుకంటే ఖేదం, మోదం కలిసిన కోటికదŠల సంకలనం. కురుస్తున్న వానకి చెవి ఒగ్గండి.., కథాసరిత్సాగరపు చెలియలికట్ట చినుకై చిట్లి, ధారగా హోరుమంటుంది.
అందుకే, ముంచినా, తేల్చినా చినుకును మళ్ళీ మళ్ళీ పిలుద్దాం. రా.., వేసవి నాటి నిప్పుల ఉప్పెన నుంచి కాసింత సేదదీర్చి పో..., 'వానా.., వానా..., వల్లప్పా'లు పాడుకుంటూ మేమంతా చినుకంత పిల్లలమై మళ్ళీ చిగురిస్తాం.., నీ మింటి రాదారిని వదిలి రా, నీ కోసం నేనీ మట్టి మీద ఆకాశాన్నై పరచుకుంటాను.., నెత్తురు మాత్రమే చిందుతున్న ఈ భూమ్మీద చల్లగా కాసిని నీళ్ళనీ చిందించి పో!
-పసుపులేటి గీత