Pages

Monday, March 1, 2010

గాడ్‌... డామిట్!


హైదరాబాద్‌, 3 డిసెంబర్
సంతోష్‌ నగర్ వీధిలో ఓ ఎండుటాకు, పక్కనే గురితప్పి నేలమీద పడిన తూటా, అక్కడే బుల్లెట్ గాయంతో మరణాన్ని ఆహ్వానిస్తూ స్ట్రెచర్ పై ఓ పోలీస్‌ కానిస్టేబుల్...
ముంబై, 26 నవంబర్
కామా హాస్పిటల్ లో ఒక గదినిండా రక్తపు మరకలే, అదేరోజు తూటాలతో చిల్లులు పడిన తాజ్
హోటల్ గోడలు...
ఒంట్లో ప్రవహించాల్సిన నెత్తురు రోడ్లమీద పారుతుంటే మీ రక్తం ఉడికిపోవడం లేదా? ప్రశ్నల్ని చంపేసే పిరికితనం మిమ్మల్ని ఆవహిస్తోందా? భయపడుతున్నారా? మీరు భయాన్ని ప్రేమిస్తున్నారా?
దేవుడనేవాడు లేకుంటే ఈ ప్రపంచం ఎంత సుందరంగా ఉండేదో ఇప్పటికైనా మీకు తెలిసొచ్చిందా? నేనానాడే చెప్పాను, నా మాటెవరైనా విన్నారా? క్షణక్షణం భయంతో వణికిపోతూ, కాళ్ళ కింద నేల కాకుండా నెత్తురే తడితడిగా తగులుతున్న ఈ క్షణంలోనైనా దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నించాలనిపించడం లేదా? నేనెవరో మీకు తెలిసుండాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ నా అవసరం మీకేమైనా ఉందేమోననిపించి ఇలా వచ్చాను. నన్ను జీన్ పాల్ సార్త్ అంటారు. నా తాత్విక చింతనకు మూలాధారం 'అస్థిత్వమే' తప్ప దేవుడు కాదు. రెండో ప్రపంచ యుద్ధాన్ని కళ్ళారా చూసినవాణ్ణి, మూడో ప్రపంచ యుద్ధ భయంతో వణికిపోయిన వాణ్ణి. రెండో ప్రపంచ యుద్ధం తరువాత రష్యా, అమెరికాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధవాతావరణం నెలకొన్నప్పుడే నేను మూడో ప్రపంచ యుద్ధం గురించి హెచ్చరించాను. ఒకవేళ అదే నిజమైతే ఆ యుద్ధం సృష్టించే భయోత్పాతం అంతా ఇంతా కాదు. చేయని నేరాన్ని మౌనంగా అంగీకరించాల్సిన వాళ్ళలా నెమ్మదిగా ప్రజలు ఆ దాష్టీకాన్ని భరించడానికి మానసికంగా తయారవుతారు. వాళ్ళు భయాన్ని ప్రేమించడం నేర్చుకుంటారు. జలుబుకో, దగ్గుకో అలవాటు పడినట్టుగా వాళ్ళు భయపడడానికి అలవాటు పడతారు. ఆ బరువు కింద వాళ్ళు నిస్సహాయంగా అణగారిపోతారు. ఈలోగా ఆందోళనకు గురై, ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన ప్రభుత్వాలు ఒకదాన్నొకటి అనుమానంగా చూసుకుంటాయి. ఆ తత్తరపాటులో ఏదో ఒక దేశం తొందరపాటుగా వ్యవహరిస్తుంది. దాన్ని సాకుగా తీసుకుని మరో దేశం దాని పీక పట్టుకుంటుంది. ఇక అప్పుడు మొదలవుతుంది అంతూపొంతూ లేని హింస. ఇప్పటికే రెండు ప్రపంచ యుద్దాల్లో మనం ప్రాణాల్ని పణంగా పెట్టాం. ఇక మరోసారి ఈ మహమ్మారి కన్ను తెరిస్తే మనం అకారణంగా మూకుమ్మడి చావు చస్తాం. యుద్ధమేదైనా చివరికి మిగిలేదేమీ ఉండదు. యోధులుండరు, నాయకులుండరు, భయవిహ్వలులైన మానవ సముదాయంపై ఒక మహోపద్రవం విరుచుకు పడుతుందంతే! ఆనాడు అంటే 1830ల తరువాత యూరప్‌ వెలుపల పలు సంఘటనల్లో సామూహిక హత్యాకాండ జరిగింది. వీటి ద్వారా అమెరికా సామ్రాజ్యవాదానికి తందాన పాడే ఫ్రాన్సు, బ్రిటన్‌ వంటి అగ్రరాజ్యాలు తమ వలసవాద సామ్రాజ్య వ్యవస్థల్ని బలపరచుకున్నాయి. పెట్టుబడిదారీ ప్రజాస్వామ్య వ్యవస్థల్లో అగ్రరాజ్యాలు పేదదేశాలకు ఆయుధాల్ని సరఫరా చేసి, విభజించి పాలించే కుట్రలకు పాల్పడడం వల్ల స్థానిక జాతుల్లో తిరుగుబాటుదారులు తలెత్తి సంక్షోభాలు నెలకొంటున్నాయి. వలసవాద దేశాల సైన్యానికి, స్థానిక తిరుగుబాటుదారులకు మధ్య నిరంతర హింసకు తెరలేచింది. ఈ స్థానిక తిరుగుబాటుదారుల్లో స్థానిక తెగలు, జాతీయవాదులు, మతవాదులు కూడా ఉంటారు. మానవాళి భయం కింద నలిగి చావడానికి ప్రచ్ఛన్న యుద్ధం చాలనుకున్నాను. కానీ ప్రచ్ఛన్న యుద్దానంతరం కూడా ప్రపంచాన్ని గ్లోబల్ వార్ భయం వీడనేలేదు. మూడో ప్రపంచ యుద్ధమైనా, పవిత్ర యుద్ధమైనా, పేరేదైతేనేం, ఇవాళ అంతర్జాతీయ సమాజాన్ని బాంబులు వేటాడుతున్నాయి. అయినప్పటికీ 'మనిషి ఇంకా బతికే ఉన్నాడు!' అదే నా ఆనందం. ఉగ్రవాదం ఒక భయంకరమైన ఆయుధం, విషాదమేమిటంటే పేదలకు అంతకు మించి మరో ప్రత్యామ్నాయం లేదు. ఈ ఆయుధమే వారిని తన ఆయుధంగా మార్చుకుంటుంది. దైవాంశ సంభూతులారా, దేవుని ప్రతినిధులారా, దేవుని సైనికులారా, మీ లక్ష్యం ఏదైనప్పటికీ, నేను మీకు నాడూ, నేడూ చెబుతున్నదొక్కటే. ఈ భూమ్మీద అనంతమైన అస్థిత్వంలోకి మనం మన ప్రమేయం లేకుండా వచ్చి పడ్డాం. ఇందులో అర్థవంతమైన ఖగోళ లేదా దైవిక కార్యకారణ సూత్రమేదీ లేదు. ప్రపంచమొక అంధకూపం. జీవితం అయితే భయంకరం, కాకుంటే అర్థరహితం, అంతే! ఇందులో విలువైనదేదైనా ఉందంటే అది మనం సృష్టించుకున్న ప్రాపంచిక విలువలు మాత్రమే. నేను 'అస్థిత్వవాది'ని. ఒక సైంటిస్టు కంటితో చూస్తే ప్రతిదీ అస్థిత్వానికి లోబడి ఉన్నదే! మానవ ప్రవర్తన ప్రేమ, పగ, లోభం, త్యాగం, హింస, ఉదార గుణాల మేలు కలయిక. మొత్తంగా చైనావాళ్ళు చెబుతారే, 'యిన్‌ అండ్‌ యాంగ్‌' అని అలాగన్నమాట! మానవ స్వభావం మంచి, చెడుల సమ్మిశ్రితం. ప్రపంచాన్ని ప్రేమ, హింస ఆవరించి ఉన్నాయి. భగవంతుని ఉనికి మనిషి స్వేచ్ఛకు గొడ్డలిపెట్టులాంటిది. దేవుడి ఉనికిని ఒప్పుకున్నామా, ఇక మనిషిగా మన స్వేచ్ఛ కేవలం భ్రమగానే మిగిలిపోతుంది. దేవుడి చూపు మనిషి స్వేచ్ఛను హరించి వేస్తుంది. మనిషి తనను తాను మలచుకునే శక్తిని హరించి వేస్తుంది. ఈ అనంత సృష్టిలో మనిషి ఒంటరివాడు. విశ్వానికి అతనెప్పుడూ పరాయివాడే! ఈ అపరిచిత సృష్టికి అర్థం బోధపడకే ఆ ఖాళీని పూరించడానికి మానవుడు దేవుణ్ణి సృష్టించాడు. తనకు అవగతం కాని అనేక వేదనలకు పరిష్కారంగా ఈ అతీతశక్తినే ఆశ్రయించాడు. నిత్య చైతన్యశీలి అయిన మానవుడు తనకు తెలియకుండా తన మీద తానే ఒక నిఘానేత్రానికి దృష్టిదానం చేశాడు. 'మీరు నమ్మరు కానీ, చానాళ్ళుగా నేను దేవుడితో పబ్లిక్‌ రిలేషన్స్ నడుపుతున్నాను. అయినా సరే అతని ఊసంటే పెద్దగా ఇష్టపడను. ఒకానొకనాడు నేను అగ్గిపుల్లలతో ఆడుకుంటున్నాను. ఆటలో రగ్గును తగలబెట్టేశాను. అప్పుడు చూడాలి, నా ముఖాన్ని! భయపడి పోయాను, నా తెంపరితనానికి దేవుడు తగిన దండన విధిస్తాడని వణికిపోయాను. తప్పు కప్పిపుచ్చుకోవడానికి నానా తంటాలు పడుతుండగా దేవుడు చూడనే చూశాడు. అతని చూపు నా మెదడులోకి చొచ్చుకుపోయింది. అది సూటిగా తప్పును కప్పెడుతున్న నా చేతుల మీదికి పాకింది కూడా! అతనికి కనబడకుండా దాక్కునే చోటే లేకపోయింది. దొరికిపోయాను. తప్పించుకోవడానికి బాత్రూమ్‌లోకి చొరబడ్డాను. అయినా అతను చూస్తూనే ఉన్నాడు. ఎలాంటి రక్షణ లేకుండా వేటగాడి బాణానికి దొరికిపోయిన లేడిపిల్లలా ఉంది నా పరిస్థితి. నాకు చాలా అవమానంగా అనిపించింది. కోపంతో రగిలిపోయాను. అయినా చేసేదేంలేక చివరికి మా తాతలాగా గాడ్‌ డామిట్, గాడ్‌ డామిట్, గాడ్‌ డామిట్... అని అసహనంగా గొణుక్కున్నాను. అంతే దెబ్బకి దేవుడు వదిలాడు, మళ్ళీ నా వంక కన్నెత్తి చూడలేదు, ఇప్పటిదాకా!' అదీ దేవుడితో నా సంబంధం.
మనం మనకోసం బతకడం, ఇతరుల కోసం బతకడం..., ఈ అంతర్మధనం, బహిర్ పోరాటాల మధ్య వైరుధ్యమే జీవితం. ఎప్పుడైతే మనం ఇతరుల కోసం బతకాల్సి వస్తుందో అప్పుడే మన స్వేచ్ఛకు శృంఖలాలు బిగిసిపోతాయి. ఈ వైరుధ్యంతో మనిషి జరిపే పోరాటంలోనే స్వీయాన్వేషణ మొదలవుతుంది. మనిషిని శాసించే సామాజిక, వైయక్తిక బంధనాలతో సలిపే పోరాటంలోనే మనల్ని మనం ఆవిష్కరించుకుంటాం. దేవుడు అనే అతీత భావజాలం మనల్ని నియంత్రిస్తుంది. మన వికాసానికి అది పరిమితుల్ని విధిస్తుంది. దీనినే నేను వ్యతిరేకించాను. అంధవిశ్వాసమంటే నాకసహ్యం. నాకూ నమ్మకాలున్నాయి. అస్థిత్వవాదమే మానవతావాదమని నమ్మిన వాణ్ణి. నా నమ్మకానికి మూలాధారం విశ్వమానవ సౌభ్రాతృత్వమే.
మనుషులు ఒకరి పట్ల మరొకరు పరమ క్రూరంగా ప్రవర్తించగలరు. చెప్పుకోదగిన కారణమేదీ లేకుండానే ఆధునిక అమెరికా వేలాది హత్యలు, లక్షలాది అత్యాచారాలతో వర్ధిల్లుతోంది. మనలో కొంతమంది ధనికులుగా, కొందరు మేధావులుగా, కొందరు ఆరోగ్యవంతులుగా, మరికొందరు దరిద్ర నారాయణులుగా ఆకలి చావులు చావడానికన్నట్టే పుడతారు. అది కేవలం అవకాశం మాత్రమే. అద్భుతవశాత్తో, ప్రమాదవశాత్తో కొందరు అమెరికన్లు ఆగర్భ శ్రీమంతులుగాను, మరికొందరు తిండికి గతిలేని ఇథియోపియన్లుగాను పుడతారు. తృతీయ ప్రపంచ దేశాల్లో వేలాది పిల్లలు పౌష్ఠికాహార లోపంతో కన్నుమూస్తున్నారు, ధనికదేశాల వారికీ సంగతే తెలియదు మరి! జీవితానికి సంబంధించి ఎలాంటి ముందస్తు ప్రణాళికలు, అనుక్రమణికలు ఉండవు. చెడ్డవారికి నరకాన్ని, మంచివారికి స్వర్గాన్ని నిర్ణయించడం కోసం భూమి అనేది మనుషుల్ని పరీక్షించడానికి దేవుడు ఎన్నుకున్న పరీక్షాస్థలి కాదు. అలాంటి నమ్మకాలన్నీ పిల్లచేష్ఠలవంటివి. దురదృష్టమేమిటంటే కోట్లాదిమంది ఇంకా అలాంటి నమ్మకాల్నే అంటిపెట్టుకున్నారు. శతాబ్దాల తరబడి దేవుని పేరిట, మతం పేరిట కోట్లాదిమంది మరణిస్తూనే ఉన్నారు. లేని దేవుని కోసం ఉన్న వాళ్ళ ప్రాణాల్ని బలి తీసుకునే ఈ ఉన్మాదం కన్నా మనలోని రాక్షసత్వానికి ప్రబల సాక్ష్యమేముంది? విశ్వం అందరి దృష్టిలోను ఒక్కలాగే ఉండదు. మానవావసరాల కన్నా విలువైన 'మంచి, చెడుగు'లేమీ లేవు. ఒక పసిబిడ్డ డిప్ఫ్తీరియాతో చనిపోతే, డిప్ఫ్తీరియాతో క్రిములు 'పాప, పుణ్యాల' గురించి ఆలోచించవు. అమెరికా బాంబులు రెండు లక్షల మంది ఇరాకీలను చంపినా, అమెరికాలోను, ఇరాక్‌లోను సూర్యుడు ఉదయించే తీరుతాడు. మంచి, చెడులన్న వాటికి, ప్రకృతికీ ఎలాంటి సంబంధం లేదు. కానీ జీవితాన్ని మరింత వికసింపజేసుకోవడానికి మనిషికి మాత్రమే ఈ మంచి చెడులు అవసరం.
అన్ని జీవుల్లాగే మనిషి కూడా ఒక 'బయోలాజికల్ క్రీచర్'. మనం కల్పించుకున్న విలువలకు, విశ్వానికీ సంబంధం లేదు. అవి మనకు, మన తోటివారికి మాత్రమే చెందినవి. ఏ దేవుడూ ఎలాంటి నియమనిబంధనలను విధించని ప్రపంచంలో మనం పుట్టాం. పుట్టుకతో వచ్చిన స్వేచ్ఛ కడదాకా ఉండదు. నిజానికి మనిషికి స్వేచ్ఛ వర్తించదు. అయినా స్వేచ్ఛే జీవితానికి జీవధాతువు. తరాల పర్యంతమూ స్వేచ్ఛ కోసం అన్వేషిస్తూనే ఉన్నాం. ప్రశ్నించీ, తిరగబడీ, ఓటమే తప్ప గెలుపెరుగని ఈ యుద్ధంలో మానవాళి అలుపెరుగని పోరు సాగిస్తూనే ఉంది. పుట్టిన నాటి నుంచి మన పరిసరాల, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక ప్రభావాలకు మనం లోనవుతాం. ఈ ప్రభావమే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. మన చర్యల్ని, ప్రతిచర్యల్ని నిర్దేశిస్తుంది. నేను ప్రతిపాదించిన అస్థిత్వవాదంలో పరిత్యాగం, పరితాపం, నిరాశ అనేవి ప్రధానమైనవి. ఇవి వినడానికి కాస్త దుఃఖపూరితంగా ఉన్నప్పటికీ మనిషి ఆశావాదిగా మారి స్వీయాన్వేషణకు పూనుకోవడంలో వీటి పాత్ర చాలానే ఉంది. ఇందులో పరిత్యాగమంటే దేవుణ్ణి పరిత్యజించడమే. మన చర్యలన్నింటికీ మనదే బాధ్యత, మరెవరో తీర్పరులు కారు. ఒంటరిగా అనంతమైన బాధ్యతల్ని తలకెత్తుకోవడంలో మనిషి పడే ఆందోళనే పరితాపం. మనం మన మీద మాత్రమే ఆధారపడి తీరాలన్న తెలివిడే నిరాశ. ఏదీ మన చేతుల్లో లేదు, అదే సమయంలో అన్నింటికీ మనమే బాధ్యులం. ఈ జ్ఞానంతోనే మనిషి మానవత్వాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేయాలి. అందుకే మీ చుట్టూ ఎన్ని దాష్టీకాలు జరిగినా న్యాయం కోసం పోరాడడాన్ని మానకండి. రెండో ప్రపంచ యుద్ధం తరువాత వంద చిన్నా చితకా యుద్ధాలు జరుగుతూనే ఉన్నా దేశాల మధ్య, ప్రజల మధ్య సమ్ఘీభావం కోసం గొంతు విప్పడాన్ని మానకండి. ఎంత నెత్తురు చిందినా శాంతి కోసం ఎలుగెత్తడాన్ని మానకండి. ముఖ్యంగా భయాన్ని ప్రేమించకండి!
-పసుపులేటి గీత

పద్దెనిమిదో శతాబ్దానికి వోల్టైర్ లాగా, పందొమ్మిదో శతాబ్దానికి విక్టర్ హ్యూగోలాగా, ఇరవయ్యో శతాబ్దపు మేధో ప్రపంచానికి జీన్‌పాల్ చార్లెస్‌ ఎమార్డ్ సార్త్ ఆరాధ్యనీయుడు. అస్థిత్వవాది, రచయిత, రాజకీయవాది అయిన సార్త్ 21 జూన్‌ 1905న పారిస్‌లో జన్మించారు. ఆయనకు 1964లో సాహిత్యానికిగాను నోబెల్ బహుమతి లభించింది. కానీ ఆయన దాన్ని తిరస్కరించారు. సార్త్ 1929లో సిమోన్‌ డి బోవార్ (ఫెమినిస్ట్
ఉద్యమకర్త, 'సెకండ్‌ సెక్స్' రచయిత)ను కలుసుకున్నారు. వారి స్నేహం చిరకాలం పాటు సాగింది. నాటి ఫ్రెంచి బూర్జువా సామాజిక కట్టుబాట్లను వారివురూ వ్యతిరేకించారు. సార్త్ 1939లో సైన్యంలో పనిచేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఆయన జర్మనీ సైన్యానికి చిక్కి తొమ్మిది నెలలు యుద్ధఖైదీగా గడిపారు. ఆయన కమ్యూనిజం పట్ల ఆకర్షితులైనా తరువాతి కాలంలో పూర్తిగా అస్థిత్వవాద అధ్యయనానికే అంకితమయ్యారు. సార్త్ రచనల్లో 'బీయింగ్‌ అండ్‌ నథింగ్నెస్', 'నో ఎక్జిట్', ప్రసిద్ధం. ఆయన 15, ఏప్రిల్ 1980న పారిస్‌లో మరణించారు.