Pages

Monday, July 6, 2009

యెహూద అమిచా



ప్రేమా, యుద్ధమూ , చరిత్రా వెరసి యెహూద అమిచా

వ్యావహారిక హీబ్రూ భాషలో కవిత్వం రాసిన తొలి ఇజ్రేలీ కవి యెహూద అమిచా. జర్మనీలో 3, మే, 1924న అమిచా జన్మించారు. ఆయన కుటుంబం 1936లో పాలస్తీనాకి వలస వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటీష్‌ యూదు దళాలతోను, 1948లో జరిగిన అరబ్ -ఇజ్రేలీ యుద్ధంలో ఇజ్రేలి రక్షక దళాలతోను కలిసి పని చేశారు. తరువాత హీబ్రూ సాహిత్యంపై కృషి చేశారు. కవిత్వంతో పాటు నవలలు, కథలు కూడా రచించారు. ఆయన రచనలు 37 భాషల్లోకి అనువాదమయ్యాయి. జెరూసలెంలో నివసించిన అమిచా 25, సెప్టెంబర్ , 2000న కాన్సెర్ తో మరణించారు. ప్రేమా, పరిత్యాగం ప్రధాన ఇతివృత్తాలుగా అమిచా కవిత్వ రచన సాగినప్పటికీ, రాజకీయ, చారిత్రక, సామాజిక సమస్యలపై కూడా అమిచా దృష్టి సారించారు. ఆధునిక ప్రేమకవిత్వానికి అమిచా చిరునామాగా మారినప్పటికీ, మానవ జీవన గమనంలోని అన్ని ఇతివృత్తాలను ఆయన సహజంగా, సరళశైలిలో అక్షరీకరించారు. హీబ్రూ భాష అప్పటిదాకా ప్రాచీన గ్రంధాలకే పరిమితమైన పరిస్థితి నుంచి దానిని యూదు ప్రజల మత, సాంస్కృతిక, రాజకీయ అవసరాల మేరకు సరళీకరించి, జన సామాన్యంలో ఆ భాషకు ప్రాచుర్యం కల్పించడంలో అమిచా కృషి ఎన్నదగినది. అమిచా కవితల్లో కొన్నింటికి తెలుగు అనువాదమిది.

నా పడక మీదే మరణించాలన్నది నా కోరిక

గిల్గాల్ నుంచి బయలుదేరిన సైన్యం
రాత్రంతా ప్రయాణించి మృత్యుక్షేత్రానికి చేరుకుంది, అంతే..
పడుగు పేకల యుద్ధభూమిలొ శవాలు దొర్లుతున్నాయి
అయినా, నా పడక మీదే మరణించాలన్నది నా కోరిక
ట్యాంకులో పగుళ్ళలాగా రాక్షసంగా వాళ్ళ కళ్లు
నేనెప్పుడూ కొద్దిమందినే, వాళ్లు మాత్రం చాలా మందే...
నేను జవాబు చెప్పే తీరాలి, వాళ్లు నా తలని ప్రశ్నలతో హింసిస్తారు
అయినా, నా పడక మీదే మరణించాలన్నది నా కోరిక
గిబియోన్‌ ఆకాశంలో సూర్యుడు నిశ్చలంగా ఉన్నాడు,
ఎప్పట్లాగే యుద్ధపిపాసుల్ని ఎండ రెచ్చగొడుతోంది
రక్తమోడిన నా భార్యని నేను చూడలేక పోవచ్చు
అయినా, నా పడక మీదే మరణించాలన్నది నా కోరిక
శామ్‌సన్‌, అతని బలమంతా నల్లని పొడవైన జుట్టులోనే ఉంది
నన్ను అమరుణ్ణి చేయగానే వాళ్ళు నాకు శిరోముండనం చేశారు
ప్రతిఘటించడాన్ని నిర్బంధంగా వాళ్ళు నాకు నేర్పారు
అయినా, నా పడక మీదే మరణించాలన్నది నా కోరిక
ఎక్కడా చోటు లేకపోతే సింహపు గుహలోనైనా
నువ్వు అందంగా జీవించగలవు
ఏకాకిగా చావడానిక్కూడా నేను జంకను
అయినా, నా పడక మీదే మరణించాలన్నది నా కోరిక

చరిత్ర పునరావృతమవుతుందో, లేదో నాకు తెలీదు
చరిత్ర పునరావృతమవుతుందో, లేదో నాకు తెలీదు
నాకు తెలిసినంత వరకు నువ్వు మాత్రం పునరావృతం కావు
నగరం రెండుగా చీలడం గుర్తుంది
యూదులు, అరబ్బులుగా మాత్రమే కాదు
మనం కలిసున్నప్పుడే
నువ్వూ, నేనుగా కూడా నగరం చీలిపోయింది

ప్రమాదాల పూర్ణగర్భాన్ని మనమే పుట్టించాం
మంచుతో ఉష్ణవాసాన్ని నిర్మించుకున్న ఉత్తర ప్రాంతవాసుల్లాగా
మృత్యుశీతల యుద్ధహర్మ్యాన్ని మనమే నిర్మించుకున్నాం
నగరం పునస్సంగమించింది
కానీ అక్కడ మనమిద్దరం కలిసి లేము
ఇప్పుడు నాకు బాగా తెలుసు
చరిత్ర పునరావృతం కాదని
నువ్వు పునరావృతం కావని నాకిది వరకే తెలిసినట్టు!

పర్యాటకులు
వాళ్ళనించి కేవలం సంతాపాన్నే పొందగలం
'హోలోకాస్ట్‌' స్మృతిచిహ్నం దగ్గర
వాళ్ళు బాసినపట్టు వేసుక్కూర్చుంటారు
'వెయిలింగ్‌ వాల్ దగ్గర విషణ్ణ వదనాలతో కనిపిస్తారు
ఆ తరువాత, హోటల్ గదుల్లోని భారీ కర్టెన్ల వెనుక
వాళ్ళు పగలబడి నవ్వుతారు
రాచెల్ , హెర్త్జ్ల్ ల సమాధుల వద్ద వాళ్ళు
మన అమరవీరుల విగ్రహాలతో కలిసి ఫోటోలు దిగుతారు
మన యువకుల్ని చూసి లోలోపలే కుళ్ళుకుంటారు
మన అందమైన యువతుల వెంటపడి చొంగకార్చుకుంటారు
చల్లని నీలి స్నానాల గదుల్లో
త్వరగా త్వరగా తమ లోదుస్తుల్ని ఆరబెట్టుకుంటారు

బరువైన రెండు సంచుల్ని నేలమీద పక్కనే పెట్టుకుని
ఒకనాడు నేను డేవిడ్స్ టవర్ దగ్గర మెట్లమీద కూర్చుని ఉన్నాను
అక్కడికి కొంత దూరంలో తన పర్యాటకులతో కలిసి ఒక గైడ్‌ నిలుచున్నాడు
నా వంక వేలుపెట్టి చూపుతూ,
'అక్కడ రెండు సంచులతో ఒక మనిషి కూర్చున్నాడు, కనిపిస్తున్నాడా...
అతని తలకి కుడివైపున రోమన్ల కాలం నాటి కమానొకటుంది చూడండి' అంటున్నాడు
'అయ్యో అతనెళ్ళిపోతున్నాడు' ఆందోళనగా చెబుతున్నాడు
కానీ, నాకు మాత్రం,
'అక్కడొక రోమన్ల కాలంనాటి కమానుంది చూశారా, అది ముఖ్యం కాదు,
దాని పక్కనే ఎడమవైపున, కొంచెం కిందుగా, తన కుటుంబం కోసం
పళ్ళూ, కూరగాయలూ తీసుకువెళుతూ,
కాస్త సేదతీరడానికి అక్కడే కూర్చున్న మనిషిని చూడండి...' అని
ఆ గైడ్‌ చెప్పగలిగినప్పుడే
ఈ దేశానికి విముక్తి దొరుకుతుందనిపించింది.

-పసుపులేటి గీత