Pages

Tuesday, March 2, 2010

(via sunshinemusings)

(via sunshinemusings): "

(via sunshinemusings)

"

నేనే ప్రేయసినీ, నేనే విధివంచితనీ


కమలాదాస్‌ (మాధవికుట్టి) వి.ఎమ్‌.నాయర్, బాలమణి దంపతులకు 31, మార్చి, 1934న జన్మించారు. తన కన్నా వయసులో పదిహేనేళ్ళు పెద్దవాడైన మాధవదాస్‌ని వివాహమాడిన కమల తన 17వ ఏట నుంచే కవిత్వం రాయడం ప్రారంభించారు. స్త్రీవాద కవితకు కమల ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాల్ని పొందారు. 'ది సైరన్స్', 'సమ్మర్ ఇన్‌ కలకత్తా', 'అల్ఫాబెట్స్ ఆఫ్ లస్ట్‌', తదితర ఆంగ్ల రచనలతో పాటు తనుప్పు, నెయ్ పాయసం, తదితర మలయాళీ రచనల ద్వారా కమల సుప్రసిద్ధం. డెభ్భైఐదేళ్ల వయసులో 31, మార్చి, 2009న కమల మరణించారు. ఆమె కవితల్లో కొన్నింటికి తెలుగు అనువాదమిది.

హిజ్రాల నాట్యం...

హిజ్రాలు వచ్చేదాకా ఒకటే ఉక్కపోత
చుట్టూ తిరుగుతూ పెద్ద పెద్ద లంగాలు,
చేతుల్లో చిడతలు, అందెల సవ్వడులు
మంకెన పూల ఎర్రని చిత్తడిలో
వాలుజడల ఊయలలు,
చిక్కని కాటుక రేఖల కాంతిపుంజాలు,
వాళ్ళు నర్తిస్తున్నారు, నర్తిస్తూనే ఉన్నారు
పాదాలు చిట్లి నెత్తురోడేలా
వాళ్ళు నర్తిస్తున్నారు
వాళ్ళ చెక్కిళ్ళపై పచ్చబొట్లు,
సిగలో మల్లెలు, కొందరు కారునలుపు
మరికొందరు పాలతెలుపు
కరుకైన గొంతుల్లో
దిగులుపడిన పాటలు
భగ్న ప్రేమికులు, ఛిద్ర గర్భస్థ శిశువుల
గురించి వాళ్ళు పాడుతున్నారు
మరికొందరు గుండెలు బాదుకుంటున్నారు
ఇంకొందరు శూన్యానందంలోకి ఒరిగిపోతున్నారు
ముప్పిరిగొన్న కరవు బరువుతో
చితిలో సగం కాలిన కట్టెల్లా
వాళ్ళు బలహీనంగా ఉన్నారు
చెట్ల మీద కాకులింకా నిశ్శబ్దంగా ఉన్నాయి
పిల్లలింకా రెప్పవాల్చ లేదు,
ఇప్పటికీ,
మెలికలు తిరుగుతున్న వాళ్ళనింకా
అందరూ చూస్తూనే ఉన్నారు
ఉరుములు, మెరుపులతో ఆకాశం విచ్చిపోయింది
సన్నటి వానజల్లు
అటక మీద బల్లులు, ఎలుకల మూత్రంతో తడిసిన
మట్టికంపును మోసుకుంటూ
సన్నటి వానజల్లు....
-
రాతియుగం
ప్రియమైన మొగుడు, మనసులో తిష్ఠ వేసిన ప్రాచీన ప్రవాసి
గాబరా గూళ్ళనల్లుతున్న ముసలి బొంత సాలీడు
దయ చూడు,
నువ్వు నన్నొక రాతిబొమ్మని చేశావు
గ్రానైట్ పావురాన్ని చేశావు
నా చుట్టూ పాతగోడల ఇరుకు గదిని కట్టావు
నువ్వు చదువుతూ, చదువుతూ అనాలోచితంగా
సొట్టలు పడిన నా ముఖాన్ని విసురుగా తాకావు
చెవులు చిల్లులు పడే నీ మాటలు
నా తెల్లవారుజాము నిద్రని చెదరగొట్టాయి
కలలు కంటున్న నా కంటిని నీ వేలితో గుచ్చావు
అప్పటికీ, నా పగటి కలల్లోకి
దృఢకాయులైన పురుషుల నీడలు ప్రవహించాయి
పోటెత్తిన నా ద్రవిడ రక్తంలోకి వాళ్ళు శ్వేతసూర్యులై ఇంకిపోయారు
పవిత్ర నగరాల కింద
రహస్యంగా మురుగు కాల్వలు పారుతున్నాయి
నువ్వు నన్ను వదిలి వెళితే
నేను నా నీలిరంగు కారులో
నీలికడలి ఒడ్డునే ప్రయాణించి
నలభై అలజడి అడుగుల దూరం పరుగెత్తి
మరొకరి తలుపు తడతాను
కిటికీల సందుల్లోంచి ఇరుగుపొరుగు చూస్తూనే ఉంటారు
వానలా నేనొచ్చి, వెళ్ళడాన్ని చూస్తూనే ఉంటారు
అడగండి, అందరూ నన్నడగండి...,
నాలో వాడేం చూశాడో అడగండి,
వాణ్ణందరూ దుస్సాహసి అనీ, పోకిరీ అనీ
ఎందుకంటారో అడగండి
నా పొత్తికడుపు కింద పట్టు చిక్కేముందు
వాడి చెయ్యి పాము పడగలా ఎందుకు ఊగుతుందో అడగండి,
నా రొమ్ములపై వాడో మహావృక్షమై తెగిపడి, ఎలా నిద్రిస్తాడో అడగండి
జీవితం మరీ ఇంత చిన్నదవడమేమిటని అడగండి,
అందులో ప్రేమ మరీ చిన్నదవడమెందుకో అడగండి,
నన్నడగండి,
ఆనందమంటే ఏమిటో, దాని మూల్యమేమిటో
నన్నగడగండి....

మా బామ్మ ఇల్లు
అక్కడొక ఇల్లుండేది...
ఒకప్పటి నా ప్రేమనగరది
ఆమె మరణంతో ఇల్లు మూగబోయింది
అప్పుడు నేనింకా చిన్నపిల్లనే
పుస్తకాల్లో కదిలే పాములతో
నా నెత్తురు తెల్లగా పాలిపోయేది
ఎన్నిసార్లనుకున్నానో
అక్కడికి వెళ్ళాలని
కిటికీల గుడ్డికళ్ళలోంచి తొంగి చూడాలని
గడ్డకట్టిన గాలి సవ్వడి వినాలని
కనీసం, భయంకరమైన నిరాశలోంచి
గుప్పెడు చీకటినైనా తెచ్చి
నా పడకగది వెనుక కుక్కపిల్లలాగా
కట్టేసుకోవాలని,
నువ్వు నమ్మవు కానీ నేస్తం,
నేనెలాంటి ఇంట్లో పెరిగానో,
ఇల్లంటే నాకెంత ప్రేమో,
నాకెంత గర్వమో...!
ఇప్పుడు నేను దారితప్పి,
ప్రేమకోసం, ఒక్క చిన్న మార్పు కోసం
అపరిచితుల తలవాకిట అడుక్కుంటున్నాను

పునీత

నిజం,
ఒకటి, రెండు కట్టుబాట్లని నేను మీరాను
అయినప్పటికీ, దైవాన్ని కాని, సమాజాన్ని కాని
క్షమాభిక్ష కోసం అర్థించను
అతిక్రమణలోనే ఆనందాన్ని అనుభవించాను
నిజంగా, నన్ను నేను పునీతురాలిగానే భావిస్తాను
పుణ్యం కోసం కాదు, పేరు ప్రతిష్టల కోసం కాదు,
పరిత్యాగంలోని నిజమైన స్వేచ్ఛా సమయాల కోసం మాత్రమే!

జబ్బు పడ్డాక...
మరణమూ లేదు, అంతమూ లేదు,
ఉన్నదల్లా అలసిన దేహం అలవాటైన నేలచాళ్ళలోకింకి పోవడమే!
నా మోకాలి మీద తన బాధతప్త ముఖాన్నుంచి అతనంటాడిలా...
'ప్రియా, నీకేం కాదు, నువ్వు బతుకుతావని నాకు తెలుసు,
నే కోరుకునేదదే...'
నా జబ్బు పచ్చపచ్చగా ఎదగడాన్ని చూస్తున్నాడతను
ఎండి, వదులైన చర్మం కింద ఎముకలు మొనదేలుతున్నాయి
గాజుకళ్ళలో పచ్చని మరకలు, దుర్గంధమైన శ్వాస,
అన్నింటినీ చూస్తున్నాడతను
అపరిచిత దైవాలకు నిత్యప్రార్థనలిప్పుడు
అతనికి అత్యంత ప్రీతిపాత్రమయ్యాయి.
నేను నా నొప్పితో పోరాడుతున్నప్పుడు
నిర్లక్ష్యం అతణ్ణి బాధిస్తుందా?
వేకువనే నాలుగింటికి ఒంటరిగా అతను మేలుకుంటాడా?
ఆకలికి తగినంత మాంసం మిగల్లేదు
నెత్తురు కాముకత్వపు ఆటుపోట్లనిప్పుడు తట్టుకునేలా లేదు
స్వాస్థ్యపు అభ్యంగనం లేక చర్మం మొద్దుబారి, ఆపేక్షరహితమైంది
మరతను దేన్ని మోహిస్తున్నాడు,
లోలోపల దాగిన అంతరాత్మనేనా...?!

పరిచయం

నాకు రాజకీయాల గురించి ఏమీ తెలీదు,
కానీ గద్దెనెక్కిన వాళ్ళ పేర్లు తెలుసు
వారాల పేర్లు చెప్పినట్టు, నెలల పేర్లు చెప్పినట్టు,
నెహ్రూ నుంచి మొదలుపెట్టి అందరి పేర్లనీ అప్పజెప్పగలను
నేను భారతీయురాల్ని, మలబార్లో పుట్టాను,
మేనిరంగు చామనఛాయ, మూడుభాషలు మాట్లాడగలను
అందులో ఒకటి కలల భాష, మిగతా రెండింట్లో రాయగలను
నన్ను ఇంగ్లిష్లో రాయద్దన్నారు, అది నా మాతృభాష కాదన్నారు
బంధుమిత్రులు, విమర్శకులు, మాటకొస్తే మీలో ప్రతి ఒక్కళ్ళూ...
నా మానాన నన్నెందుకు బతకనివ్వరు?
నాకిష్టమైన భాషలో నన్నెందుకు మాట్లాడనివ్వరు
నేనేది మాట్లాడితే అదే నా భాష,
దాని శృతులు, అపశృతులు, అర్థాలు, అపార్థాలు, వింతలూ, వికారాలు
అన్నీ... అన్నీ నావే, కేవలం నావి మాత్రమే!
అది వచ్చీరాని ఇంగ్లిషే కావచ్చు, సంకర భారతీయతే కావచ్చు,
తలతిక్కగానూ ఉండొచ్చు, కానీ అందులో నిజాయితీ ఉంది
మీక్కనిపించడం లేదా, నేనెంతటి మానవినో అదీ అంతటి మానవాంశే!
భాష నా ఆశలకీ, ఆకాంక్షలకీ, నా కోరికలకీ, నా ఆనందాలకీ గొంతునిస్తుంది
కాకులకు కావుకావుమనడం ఎలాగో, సింహాలకి గర్జించడం ఎలాగో
భాష నాకూ అలాంటిదే, అది మానవ భాష,
అది మనసు వ్యాకరణం, చూడగలిగిన, వినగలిగిన,
తెలుసుకోగలిగిన మనోవాక్కు
తుపానులో ఊగే చెట్లలాగా, వానాకాలపు మబ్బుతునకలాగా,
చితిమంటల చిటపటలాగా
అది చెవిటి, గుడ్డి మాట కాదు
నేను పసిదాన్నే, ఎదిగానంటున్నారు
దేహావయవాలు ఒంపులు తీరి, పొడవయ్యాయి,
ఒకటి, రెండు చోట్ల నూనూగు వెంట్రుకలు మొలిచాయి
ఏమడగాలో తెలియక నేను ప్రేమని అడిగినప్పుడు
అతను పదహారేళ్ళ యవ్వనాన్ని పడక గదిలో తోసి తలుపేశాడు
అతను నన్నేమీ కొట్టలేదు
కానీ నా స్త్రీదేహం దిగులు, దిగులుగా గాయపడింది
గర్భమూ, రొమ్ముల బరువుకింద నలిగి పోయాను
దీనాతిదీనంగా ముడుచుకు పోయాను.
తరువాత నేను చొక్కా తొడుక్కున్నాను
నా తమ్ముడి లాగూలు వేసుకున్నాను
జుట్టుని పొట్టిగా కత్తిరించేశాను
నా స్త్రీత్వాన్ని మరచిపోయాను
'చీర కట్టుకో, ఆడపిల్లలా, పెళ్ళాంలా ఉండు' అని వాళ్ళన్నారు
కుట్లు, అల్లికలు నేర్చుకో, వంట నేర్చుకో
పనివాళ్ళతో పోట్లాడు,
సంసారిలా ఉండంటూ ఎల్లల కాపలాదార్లు మొత్తుకున్నారు
గోడల మీద కూర్చోకు, మా కిటికీల్లోకి తొంగి చూడకు
'అమీ'లా ఉండు, కమలలా ఉండు, కనీసం
మాధవికుట్టిలానైనా ఉండన్నారు
పేరెంచుకునే వేళొచ్చింది
ఒక పేరు, ఒక పాత్ర...
నటించకు, పిచ్చిదానిలాగానో, అపžరసలాగానో నటించకు
ప్రేమలో మోసపోతే అసహ్యంగా ఏడవకు
నేనొకతణ్ణి కలిశాను, ప్రేమించాను
అతని పేరెందుకులే, నాలాగే ప్రతి స్త్రీ కోరుకునే మగవాడతను
అతనిలో నదుల ఒరిపిడి, నాలో కడలి నిరీక్షణ
నేను ప్రతి ఒక్కళ్ళనీ అడిగాను
'ఎవరు నువ్వు?'
అందర్నుంచీ ఒకటే జవాబు... 'నేను'!
ప్రతిచోటా తనని తాను 'నేన'ని పిలుచుకునే వ్యక్తినే చూశాను
ఒరలో కత్తిలా ఉన్నాడతను
విచిత్రమైన నగరాల హోటళ్ళలో
అర్థరాత్రి ఒంటరిగా తాగుతూ నేనే
ఒంటరిగా నవ్వుతూ నేనే
ప్రేమించిందీ నేనే, అవమాన పడ్డదీ నేనే
గొంతులో గిలక అడ్డంపడి తన్నుకుంటూ చస్తున్నది నేనే
నేనే పాపినీ, నేనే రుషినీ
నేనే ప్రేయసినీ, నేనే విధివంచితనీ
నీవి కాని మోదాలేవీ నా దగ్గర లేవు
నీవి కాని ఖేదాలేవీ నాకు లేవు
నన్నిప్పుడు నేను కూడా 'నేన'నే పిలుచుకుంటాను

అద్దంలోకి చూడు...

ప్రేమించడానికి మగాడు దొరకడం చాలా సులభమే
కానీ ఆడదానిగా నీ కోరికల పట్ల నిజాయితీయే ముఖ్యం
అతని అద్దం ముందు నగ్నంగా నిలుచో
నువ్వెంత బలవంతురాలివో అతణ్ణి చూడనీ, నమ్మనీ
అప్పుడు నువ్వు ఇంకా మృదువుగా, ఇంకా యవ్వన శోభస్కురాలిగా
ఇంకా ప్రేమైకమూర్తిగా కనిపిస్తావు
నీ అభిమానాన్ని వ్యక్తీకరించు
అతని దేహావయవాల పటుత్వాన్ని గమనించు
షవర్ కింద తడుస్తూ ఎరుపెక్కే అతని కళ్ళని గమనించు
బాత్రూంలో సిగ్గుపడే నడకల్ని గమనించు
టవళ్ళని విడిచిపేట్టేయడాన్ని గమనించు
చిత్రంగా కదులుతూ అతను మూత్ర విసర్జన చేయడాన్ని గమనించు
అన్నింటినీ..., అన్ని ఇష్టమైన కదలికల్ని గమనించు
అతణ్ణి సిసలైన మగవాణ్ణి, నీవాణ్ణి చేసే ప్రతి కదలికనూ గమనించు
నిన్ను పరిపూర్ణ స్త్రీని మార్చే అన్నింటినీ అతనికి బహూకరించు
పొడవైన జుట్టు, రొమ్ముల నడుమ సువాసన
రుతుస్రావపు వెచ్చని స్పర్శ, అనంతమైన
నీ ఆడతనపు ఆకళ్ళన్నింటినీ అతనికి బహూకరించు
ప్రేమించడానికో మగాడు దొరకడం సులభమే
కానీ తరువాత అతను లేకుండా
జీవించడమంటేనే ఏటికి ఎదురీదడం
జీవచ్ఛవంలా ఆగంతుకుల మధ్య కలియదిరుగుతూ,
అన్వేషణ ముగిసిన కళ్లతో,
నీ పేరుని పిలిచిన అతని చివరి పిలుపును
మాత్రమే వినగలిగిన చెవులతో
కొలిమిలో కాలిన ఇత్తడిలా
ఒకనాడు అతని స్పర్శ కింద వెలిగిన దేహంతో...
ఇప్పుడిలా కేవలం ఒక ఉంపుడుకత్తెలా, ముష్టిదానిలా
జీవించడమంటేనే ఏటికి ఎదురీదడం...!
-పసుపులేటి గీత