Pages

Monday, February 22, 2010


చినుకుల గొడుగు
'వేసవి నాటి ధూళిదుమారాన్ని గుర్తు చేస్తుంది నాకు తొలకరి చినుకు, ఈ చినుకుకు నిరుటి జ్ఞాపకాలేవీ లేవు, ఏడాదంటే గతం తాలూకు ఏ గుర్తుల్నీ మననం చేసుకోలేని విధంగా తర్ఫీదు పొందిన జంతు'వంటాడు ఇజ్రేలీ కవి యెహుదా అమిచా. సరిగ్గా అలాగే ఈ చినుకు ఏ జ్ఞాపకాల తడి అంటని పాలిథిన్ కవరులా నా ముఖాన్ని కమ్ముకుని ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
దారుల మీద శృతి తప్పని చక్రాల జలతరంగిణి, వాహనాలపై వానచినుకుల మాఘమల్హారం. ఫుట్పాత్ నదిలోకి తర్జుమా అవుతోంది. నడిరోడ్డు మీద సముద్రం ఒళ్ళువిరుచుకుంటోంది. డ్రైవర్లు స్టీరింగు పట్టుకున్న సరంగులే అయ్యారు. వంగిన నడుం మీద ఎడమచేతి నుంచి, కుడిచేత్తో ఎదురుగాలిని అదిలిస్తూ, పట్టుతప్పుతున్న కాలిమడమల్ని మందలిస్తూ, వయోభారపు విన్యాసాలకి ఒళ్ళప్పగించిన ఒకానొక ముసలావిడ ఆటోచక్రాల ఆకతాయితనాన్ని తిట్టుకుంటోంది. పిడికిట్లో ముద్దకట్టిన చద్దన్నంలా చలికి వజవజలాడుతున్న ఆమె పాదాల కింద ఏ మాన్హోల్ నోరు తెరచుకుందో, వానంటే నేల మీద నడిచే కృష్ణబిలం. మనిషి లోపలి మనిషిలా, మనిషి లోపలి మబ్బులా నల్లటి చిక్కటి చీకటి వాన, ఏ పేదగుడిసెని ఊడ్చుకు పోవడానికో కన్ను తెరచిన పెనుతుపాను కూనలాంటి చినుకు, వానొస్తే కూలిదొరక్క పస్తులతో ముడుచుకుని పడుకునే బడుగుల ఆకలి కేకల గొంతుని చల్లగా నులిమే హంతకురాల్లాంటి చినుకు, చీకటంటే అర్థం కాని పసి పిల్లల గుండెల్లో ఒంటరితనపు సుడిగుండమై గుక్క పట్టే చినుకు,... అయితేనేం, వరిమళ్ళలో పరమాన్నపు పలవరింతై పులకలెత్తేందుకు పరుగులెత్తుతున్నదీ ఈ చినుకేగా!
చూరుల నుంచి కిందికి జారుతున్న చినుకు, కిందికే జారుతున్న చినుకు..., ప్రతిసారీ అపరిచిత నేస్తంలా పలకరించే చినుకు ఎప్పట్లాగే కిందికే జారుతోంది. పారిపోయేందుకు అవకాశంలేని ఖైదీల్లా వాన తెరల నడుమ రోడ్డు పక్కన చెట్లు. వాటి నీడల తలుపుల్ని తడుతూ, తడుపుతూ, చినుకు..., తలుపు తట్టిన చప్పుడైతే రెమ్మల్ని తెరిచి చూశాయి ఆకులు, ఎదురుగా చినుకు రాలుతోంది. 'అరెరె, కిందపడి పోతోంది, పట్టుకోండి...' అంటూ ఆతృతగా గలగలలాడాయవి! అలికిడికి చుట్టూ ఉన్న చెట్లన్నీ చినుకుపిట్టకి కొమ్మలందించబోయాయి, అయినా కిందికి జారడమే తప్ప, తీగలా పైకల్లుకోవడమెలాగో తెలీలేదు దానికి. చెట్లు చిన్నబోయి తలలు వాల్చాయి. కాలం కూడా ఇంతే, గుప్పెట్లో ఇమడదు. చినుకు జారుతూనే ఉంది, ఇంకెంత సేపు జారాలోనన్న బెంగలేదు, కిందపడి పోతానన్న బెదురు లేదు. రెక్కలున్న ప్రతిదీ పైకే ఎగరాలని ఎవరు చెప్పారు...? అంటూ చినుకు నావైపు క్షణమాత్రం సాలోచనగా చూసింది. ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు? ఉన్నత శిఖరాలు, ఉన్నత లక్ష్యాలు, ఉన్నత జీవన ప్రమాణాలు,... అంతా ఉన్నతంగానే ఉండాలని సమాజం నిర్దేశించింది కనుక 'పైకి, పైపైకి...' అన్నదే జీవన సూత్రమైంది. ఈ చినుకు పిట్టని చూశాకే తెలిసింది, పైకెగరడానికి రెక్కలే కావలసి వస్తే, కిందికి జారడానికీ రెక్కలుండాలని! గాలి రెక్కలల్లారుస్తూ చినుకుపిట్ట కిందికి ఎగురుతోంది. ఏదైనా కింద పడిపోతే, 'అరెరే..' అంటూ బాధపడిపోయే మనస్తత్వాన్ని సమాజం నుంచి నేనూ అందిపుచ్చుకున్నాను. అందుకే అప్రయత్నంగా అరచేయి అడ్డు పెట్టి చినుకునడ్డగించాను. అరచేతిలో రాలిన ఒక చినుకు, పది చినుకులై చింది, నన్ను పరిహసిస్తూ, వేళ్ళ సందుల్లోంచి మళ్ళీ జారిపోయింది. చినుకంటే పడిపోవడమే, నేలమీద పతనమై, వాగుగా, వంకగా పరుగులెత్తడమే,... మొలకగా చివుళ్ళెత్తి, ఏపుగా పైకి ఎదగడమే. పడిపోవడమంటే మళ్ళీ నిలుచోవడమే. చినుకంటే వరదగా అంతటినీ తుడిచేయడమే, ఒండ్రుగా నేలని సారవంతం చేయడమే. చినుకంటే సేద్యం, చినుకంటే ఫలసాయం, చినుకంటే ఉప్పెన, చినుకంటే ఉపద్రవం, చినుకంటే ఒకచోట బతుకును ముంచేసి, కాల్చేసే నీటి నిప్పు, మరోచోట పిడికెడు ముద్దయి, ఆకలి నిప్పునార్పే నీటి విత్తనం. చినుకంటే ఖేదం, మోదం కలిసిన కోటికదŠల సంకలనం. కురుస్తున్న వానకి చెవి ఒగ్గండి.., కథాసరిత్సాగరపు చెలియలికట్ట చినుకై చిట్లి, ధారగా హోరుమంటుంది.
అందుకే, ముంచినా, తేల్చినా చినుకును మళ్ళీ మళ్ళీ పిలుద్దాం. రా.., వేసవి నాటి నిప్పుల ఉప్పెన నుంచి కాసింత సేదదీర్చి పో..., 'వానా.., వానా..., వల్లప్పా'లు పాడుకుంటూ మేమంతా చినుకంత పిల్లలమై మళ్ళీ చిగురిస్తాం.., నీ మింటి రాదారిని వదిలి రా, నీ కోసం నేనీ మట్టి మీద ఆకాశాన్నై పరచుకుంటాను.., నెత్తురు మాత్రమే చిందుతున్న ఈ భూమ్మీద చల్లగా కాసిని నీళ్ళనీ చిందించి పో!
-పసుపులేటి గీత

Tuesday, July 7, 2009


మహ్మద్‌ దర్వీష్
నేనక్కడి వాడినే
‌
సరిగ్గా గుర్తులేదు కానీ, ఆరోజు నేను చదివిన కవిత భావాన్ని చెబుతాను. ఒక అరబ్బు పిల్లాడు, మరో యూదు బాలునితో ఇలా అంటాడు... 'ఎండలో నీ ఇష్టం వచ్చినంత సేపు నువ్వాడుకోవచ్చు, నీ బొమ్మలు నీకుంటాయి... కానీ నాకే ఏ ఆటలూ లేవు, బొమ్మలూ లేవు/ నీకో అందమైన ఇల్లుంది, నాకు గూడే లేదు/ నీకు వేడుకలున్నాయి/ నాకేమీ లేవు, మనిద్దరం కలిసి ఎందుకాడుకోకూడదు?...' ఇందులో మీకేమైనా తప్పుగా వినిపించిందా? కానీ ఆ మిలిటరీ గవర్నర్ కి మహాపరాధమే ధ్వనించింది. నన్ను పిలిచాడు. 'ఇలాంటి రాతలే రాస్తే, మీ నాన్నని క్వారీ పనిలోంచి తీసేస్తాను...' అంటూ తర్జనితో బెదిరించాడు నన్ను. చిన్నతనంలో బడి వార్షికోత్సవం లో నేను చదివిన ఈ కవిత ఆయనకి కోపం తెప్పించింది. ఇలాంటి కవితలు రాయడం మానేయమంటూ నాకు హుకుం జారీ చేశాడు. కానీ ఇలాంటి హుకుంల నీడలో ఇరవయ్యారేళ్ళు ప్రవాసిగా, దేశబహిష్కారానికి గురై ప్రపంచాన్ని చుట్టిన నాలో మాతృదేశంపై మమకారం నానాటికీ హెచ్చిందే తప్ప తగ్గలేదు.
'నమోదు చేసుకో, నేను అరబ్బుని! నా గుర్తింపు కార్డు నెంబరు యాభైవేలు. నాకెనిమిది మంది పిల్లలు. ఈ వేసవి తరువాత తొమ్మిదోది పుట్టబోతుంది, నీకు మంటగా ఉందా? నమోదు చేసుకో, నేనొక అరబ్బుని! తోటివారితో కలిసి క్వారీలో పనిచేస్తుంటా! నాకెనిమిది మంది పిల్లలు, వాళ్ళకి తిండీ, బట్టా, పుస్తకాల్ని ఈ రాళ్ళనించే తెస్తాను! నీ గుమ్మం ముందు నుంచుని యాచించను, నీ కార్యాలయపు మెట్ల మీద నుంచుని నన్ను నేను కించపరచుకోను, అందుకే నీకు మంటగా ఉందా? నమోదు చేసుకో, నేనొక అరబ్బుని! ఏ బిరుదులూ లేని పేరొకటుంది నాకు, జనం నిప్పులు కక్కే దేశంలో నేనోర్పుగా ఉన్నా! కాలం పుట్టక ముందే, యుగాలు కళ్ళు తెరవక ముందే ఆలివ్‌ చెట్లూ, గడ్డీ మొలవక ముందే నా వేళ్ళు ఈ దేశంలో పాతుకుపోయాయి. నా తండ్రిది నాగలిపట్టిన వంశం. వాళ్ళు ధనికులు కారు. నా తాత గాలికీ, ధూళికీ పెరిగిన పేద రైతు, వాళ్ళు నాకు ఎండపాటులోని గొప్పదనాన్ని నేర్పారు. వెదురు బొంగులతో కట్టిన గుడిసె నా ఇల్లు. నా పేదరికం నీకు తృప్తినిచ్చిందా? నమోదు చేసుకో, నేనొక అరబ్బుని! నేను, నా పిల్లలు సాగు చేసుకుంటున్న తాతముత్తాల నాటి నా తోటని నువ్వు దొంగిలించావు. ఈ రాళ్ళు తప్ప మాకేమీ మిగల్చలేదు. అందుకే మొదటి పేజీలో రాసుకో, నాకు మనుషులంటే కోపం లేదు, నేను దేన్నీ ఆక్రమించను, కానీ నాకాకలైతే మాత్రం నన్ను దోచుకున్న వాడి మాంసమే నా ఆహారం! తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త, నా ఆకలి నుంచీ, నా ఆగ్రహం నుంచీ తస్మాత్ జాగ్రత్త!' అంటూ నిప్పులు చెరగడానికి సరిహద్దులు అడ్డుకాలేదు.
'నేనక్కడి వాడినే, నాకెన్నో జ్ఞాపకాలున్నాయి. అందర్లాగే నేనూ పుట్టాను. నాకూ ఓ అమ్మ ఉంది, తోబుట్టువులూ, స్నేహితులతో పాటు బోల్డు కిటికీలున్న ఇల్లూ ఉంది, దాంతో పాటు ఓ జైలుగదీ ఉంది, దానికో చలి కిటికీ ఉంది, సముద్రపు కాకులు మోసుకొచ్చిన అలొకటి నాదగ్గరే ఉంది. ఇదంతా నాదైన సర్వదిగ్దర్శక చిత్తరువు. నాకొక పరిపూర్ణమైన మైదానముంది. నా పదానికి లోతైన దిజ్ఞ్మండలముంది. పిట్టలకి జీవనాధారమైన జాబిలొకటి నాకుంది. అనశ్వరమైన ఆలివ్‌ వృక్షమూ ఉంది. కత్తులు మనిషిని ఎరగా మార్చకముందే నేనక్కడ నివసించాను. నేనక్కడి వాడినే. స్వర్గం తన తల్లికోసం గుక్కపట్టినప్పుడు నేను దాన్ని దాని తల్లి చేతిలో పెట్టాను. నేను దుఖిమ్చాను, నా అశ్రువుల్ని ఏ మేఘమైనా తిరిగి మోసుకొస్తుందేమోనని. నియమానికి విరుద్ధంగా రక్తవిచారణకి అవసరమైన అన్ని పదాల్నీ నేను నేర్చుకున్నాను. ఒకే ఒక్క పదం కోసం నేర్చుకున్న అన్ని పదాల్నీ ధ్వంసం చేశాను. ఆ పదమేమిటో తెలుసా, 'స్వదేశం!' పాలస్తీనా నా ప్రేయసి, ఆమెవి పాలస్తీనా కళ్లు, ఆమె పేరు పాలస్తీనియను, ఆహార్యంలోనూ, విషాదంలోనూ ఆమె పాలస్తీనీయనే, ఆమె ఆపాదమస్తకం పాలస్తీనియనే, ఆమె మాటలు, ఆమె నిశ్శబ్దం పాలస్తీనియనే, ఆమె పుట్టుకా, ఆమె చావూ పాలస్తీనియనే! ఈ ప్రేమలోంచే నేనొక 'నిరసనకారుని'గా, కవిగా ఎదిగాను.
'ఇది సుసాధ్యమే, కొన్ని సమయాల్లోనైనా ఇది సుసాధ్యమే! మరీ ముఖ్యంగా ఇప్పుడు సుసాధ్యం, జైలు గదిలో గుర్రపు స్వారీ చేస్తూ పారిపోవడం సుసాధ్యమే. అదృశ్యమవడం జైలు గోడలకు సుసాధ్యమే. జైలుగది సరిహద్దుల్లేని సుదూర సీమవుతుంది. గోడల్ని నువ్వేం చేసుకుంటావు? అందుకే వాటిని రాళ్ళకి తిరిగిచ్చేస్తాను. ఈ పైకప్పుతో నీకేం పని? దానిని నేను గుర్రపు జీనుగా మార్చేస్తాను. ఇక ఈ సంకెళ్ళు,.. నేను వాటిని తూలికలుగా మారుస్తాను. ఈ మాటలు గార్డుకి కోపాన్ని తెప్పించాయి. కవిత్వమంటే తనకి గిట్టదన్నాడు. నా జైలుగది తలుపులకి గొళ్ళెం పెట్టాడు. పొద్దుటే తిరిగి నన్ను చూడ్డానికొచ్చాడు. కోపంగా అరిచాడు, ఎక్కడివీ నీళ్ళన్నీ? నైలునది నుంచి నేనే తెచ్చానన్నాను, ఈ చెట్లూ...? డమాస్కస్‌ తోటల్నించి తెచ్చా! ఈ సంగీతం...? నా గుండెచప్పుణ్ణుంచి తెచ్చా! గార్డుకి పిచ్చెక్కింది, నా మాటలకి కళ్ళెం బిగిస్తూ నా గది తలుపులకి గొళ్ళెం పెట్టాడు. సాయంత్రం మళ్ళీ వచ్చాడు. ఈ చంద్రుడెక్కడి నుంచొచ్చాడని అడిగాడు. బాగ్దాద్‌ రాత్రుల నుంచి అన్నాను. ఈ మధువు...? అల్జీర్స్ ద్రాక్షతోటల్నుంచి! ఈ స్వేచ్ఛ...? రాత్రి నువ్వు నాకు బిగించిన సంకెల నుంచి! గార్డు దు—ఖితుడయ్యాడు. తన స్వేచ్ఛని తనకిమ్మని అతను ప్రాధేయపడ్డాడు.' ఈ నా 'జైలుగది' పాలస్తీనా ప్రజల గుండెల్లో నిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉంది.
నా పాలస్తీన్‌ లిబరేషన్‌ ఆర్గనైజేషన్‌ మిత్రుల్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఓస్లో ఒప్పందాన్ని వ్యతిరేకించకుండా ఉండలేని నా పట్టుదలలోంచి వాళ్ళనిలా ప్రశ్నిస్తున్నాను. సమున్నతమైన శిఖరాల్నుంచీ ఇలా అగాధాల్లోకి మనం జారిపడక తప్పదా?! మనం దేవతలం కామని తెలుసుకోవడానికి మన చేతులకీ రక్తపు మరకలంటక తప్పదా? మన నిజస్వరూపం కన్యాత్వాన్ని కోల్పోయిందని చెప్పడానికి మనం మన మర్మావయాల్ని లోకం ముందు ప్రదర్శించక తప్పదా? 'మేం ప్రత్యేకమైన వాళ్ళం' అని ఎప్పుడైతే మనం చెబుతామో అప్పుడు మనను మించిన అబద్దాలకోరులుండరు. ఇతరులకు అసత్యం చెప్పడం, నీ మీద నీకు అర్థరహితమైన నమ్మకాన్ని కలిగి ఉండడం ఒక్కటే! మనల్ని ద్వేషించే వారిని ప్రేమించడం, మనల్ని ప్రేమించే వారిని ద్వేషించడం..., దీనికన్నా అవివేకం మరొకటుందా?!
గతమా మమ్మల్ని మార్చొద్దు, నీనుంచి మేమెప్పుడో దూరంగా పారిపోయాం. మీరెవరు, నానుంచి మీకేం కావాలి అని భవితవ్యమా మమ్మల్ని ప్రశ్నించొద్దు. మాకేం కావాలో మాకే తెలియదు కాబట్టి. వర్తమానమా, మమ్మల్ని కాస్త భరించు, ఎందుకంటే మేం కేవలం బావురుమంటూ దారిన పోయే దరిద్రులం కాబట్టి! అస్థిత్వమనేది మనకు వారసత్వంగా సంక్రమించలేదు, మరణశాసనం ద్వారానే దాన్ని పొందాం. మన ముఖం మనకు అందంగా కనిపించగానే చేజేతులా మనమే పగలగొట్టుకున్న అద్దం మన అస్థిత్వం! నువ్వెంత సేపైనా నా కళ్ళలోకి సూటిగా చూడు, అక్కడ నీకు నా చూపు దొరకదు. ఎందుకంటే ఒక వదంతి దాన్ని దొంగిలించేసింది. నా హృదయం నాది కాదు, అది ఎవరిదీ కాదు. శిలగా మారకుండానే అది స్వాతంత్య్రాన్ని ప్రకటించుకుంది. ఖైదీ కారాగారాన్ని చేరడానికి తాపత్రయ పడుతున్నాడు, తన విజయ హాసాన్ని కెమెరాల కళ్ళనించి దాచేస్తున్నాడు. కానీ అతని కళ్ళు ఆనందాన్ని దాచిపెట్టలేక పోతున్నాయి, పాలస్తీనీయన్లుగా ఉన్నంతకాలం మనం స్వకాముకులం ఎందుక్కావాలి? 'నా బంధువుపై దాడికి నేనూ, ఆగంతుకుడూ సైన్యంలో కలుస్తాం, నా సోదరునిపై దాడికి నా బంధువూ, నేనూ సైన్యంలో చేరతాం. నా మీద దాడికి నేనూ, నా షేకూ సైన్యంలో కలుస్తాం'- జాతీయ విద్యా ప్రమాణాల్లో ఇదే తొలిపాటం. శత్రువు తూటాల వల్ల మరణించిన వాడా, తన సోదరుని తూటాల వల్ల మరణించిన వాడా..., అగాదాల చీకట్లో పడి స్వర్గానికి ముందుగా ఎవరు చేరుకుంటారు? నీ తల్లి గర్భం నుంచే నీ శత్రువు పుడతాడని ధర్మకోవిదులు కొందరంటారు. సంప్రదాయవాదులు నన్ను చిరాకు పెట్టరు. వారి లౌకికవాద సానుభూతిపరులు మాత్రం నన్ను చికాకు పరుస్తున్నారు. వారి నాస్తికవాద సానుభూతిపరుల్లాగే చికాకు పరుస్తున్నారు. నా అస్థిత్వానికి నేను అవమాన పడడం లేదు. ఎందుకంటే అదింకా నిర్మాణంలో ఉంది.
'అనిత్యమైన పదాల వెంటపడి పోతున్నవాళ్ళంతా వినండి, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోయే తరుణమొచ్చింది. ఎక్కడికైనా వెళ్ళి ఉండండి, మామధ్య మాత్రం వద్దు, మీరు వెళ్ళి పోయే సమయమొచ్చింది, ఎక్కడికైనా వెళ్ళి చావండి, మా మధ్య మాత్రం చావొద్దు!' ఇలా నేనన్నప్పుడు అందరూ నన్నొక దోషిగా చూశారు. పాలస్తీనా మెయిన్‌స్ట్రీమ్‌ రాజకీయాల్ని సమర్థిస్తున్నానన్న అపప్రదని నేను మోశాను. కానీ నేను ఏ అపవాదులకీ జంకను. 'చెల్లెలా, నా గొంతులో కన్నీళ్ళున్నాయి, నా కళ్ళలో నిప్పులున్నాయి, నేను స్వతంత్రుణ్ణి! సుల్తాను ద్వారం ముందు నేను నిరసన తెలుపనక్కర్లేదు. ఇదివరకే మరణించిన వారంతా, రేపవల ద్వారం ముందు ఇకపై మరణించబోయే వారంతా నన్ను కౌగిలించుకున్నారు, నేనిప్పుడు వారి ఆయుధాన్ని!'
శత్రువును కూడా మానవీకరించే పనిని నేనాపను. నాకు హీబ్రూ నేర్పిన తొలిగురువు ఒక యూదు వ్యక్తి. నా జీవితంలో తొలిప్రేమపాదును చిగురింపజేసింది ఒక యూదు యువతే. నన్ను జైలుకు పంపిన తొలి న్యాయమూర్తి కూడా ఒక యూదు వనితే. అందుకే ఆది నుంచీ యూదుల్ని నేను దెయ్యాలుగానో, దేవతలుగానో చూళ్ళేదు, వాళ్ళని కేవలం నాలాంటి మనుషులుగానే చూశాను. యూదుల కోసం నేనెన్నో కవితలు రాశాను. వాటిలో ప్రేమ పార్శ్వాన్ని తప్ప యుద్ధ మూలాల్ని చర్చించలేదు.
గలీలీలోని అల్బిర్వాలో పుట్టాన్నేను. నాకప్పుడు ఏడేళ్ళు, ఇజ్రేలీ సైన్యం పాలస్తీనాపై సామూహిక హత్యాకాండకు పూనుకుంది. దాంట్లో భాగంగానే మా గ్రామాన్ని సైన్యం ధ్వంసం చేసింది. మా గ్రామాన్నే కాదు మరో నాలుగు వందల గ్రామాల్ని బుగ్గి చేసింది. మా కుటుంబం బతుకుజీవుడా అంటూ లెబనాన్‌కు పారిపోయింది. కానీ పుట్టినగడ్డ మీద మమకారం చావక దొంగతనంగా మా గ్రామానికి తిరిగి వచ్చాం. అప్పట్నుంచీ సైనిక పాలన కింద సొంత ఊరిలోనే పరాయివాళ్ళంగా బతికాం. ఇదిగో ఈ పరాయీకరణే నాకు మాతృదేశపు విలువను తెలియజెప్పింది. ఇందాక చెప్పిన 'రాతల'వల్ల నేను సైనిక పాలనలో చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ హింస 1950 నుంచీ 1970 వరకూ అంటే నేను పైచదువుల కోసం రష్యాకు వెళ్ళేంత వరకు నిరాటంకంగా సాగింది. అక్కడి నుంచీ ఈజిప్టుకీ, ఈజిప్టు నుంచి బీరట్ కి, మళ్ళీ బీరట్ నుంచి అరబ్బు దేశాల రాజధానులన్నింటినీ చుట్టి వచ్చి, పారిస్‌లో కొంతకాలమున్న తరువాత రమల్లాలో స్థిరపడ్డాను. అది కూడా నా జన్మభూమికి కొంత దూరంలోనే. 'నా ఆద్యంతాల్ని కలపడానికి ఆయువు సరిపోవట్లేదు..'! నిద్రంటే శాంతి, నిద్రంటే స్వప్నం, స్వప్నం నుంచి జనించేదే సుషుప్తి! పాలస్తీనియన్‌ పిల్లలంతా నా కవితల్ని తమ కవితలుగా ప్రకటించుకునే రోజును స్వప్నిస్తూ..., ప్రవాసుల, దేశబహిష్కృతుల కన్నీళ్ళతో తడవని నేలని కలగంటూ ఎన్నటికీ సెలవడగని మీ దర్వీష్‌.
-పసుపులేటి గీత

(పాలస్తీనియన్‌ జాతీయ కవి మహ్మద్‌ దర్వీష్‌ 13, మార్చి, 1941న పాలస్తీనాలోని అల్బిర్వాకి చెందిన గలీలి అనే గ్రామంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు. ఇజ్రాయిల్ సైన్యం పాలస్తీనాను ఆక్రమించిన తరువాత వీరి కుటుంబం లెబనాన్‌కు పారిపోయింది. తరువాత స్వగ్రామానికి తిరిగి వచ్చినా శరణార్థుల్లా జీవించాల్సి వచ్చింది. చిన్నతనంలోనే దర్వీష్‌పై ఈ పరాయీకరణ ప్రభావం పడింది. యవ్వన తొలినాళ్ళలోనే ఆయన అరబ్బుల అస్థిత్వాన్ని ప్రకటిస్తూ చేసిన రచనల ఫలితంగా దేశ బహిష్కారానికి గురికావలసి వచ్చింది. ఇజ్రేలీ కమ్యూనిస్ట్‌ పార్టీ 'రఖా'లో ఆయన సభ్యులుగా ఉండేవారు. తరువాత పాలస్తీన్‌ లిబరేషన్‌ ఆర్గనైజేషన్‌ (పిఎల్వో)లో సభ్యత్వం స్వీకరించారు. దర్వీష్‌ 1993లో కుదిరిన ఓస్లో ఒప్పందంపై విముఖతతో పిఎల్వోకి రాజీనామా చేశారు. ఆయన ముప్ఫైకి పైగా కవితా సంపుటులు వెలువరించారు. పలు అంతర్జాతీయ పురస్కారాల్ని పొందారు. దర్వీష్‌ 9, ఆగస్ట్‌, 2008న గుండెకి శస్త్రచికిత్స జరిగిన తరువాత మరణించారు.)

Monday, July 6, 2009

యెహూద అమిచా



ప్రేమా, యుద్ధమూ , చరిత్రా వెరసి యెహూద అమిచా

వ్యావహారిక హీబ్రూ భాషలో కవిత్వం రాసిన తొలి ఇజ్రేలీ కవి యెహూద అమిచా. జర్మనీలో 3, మే, 1924న అమిచా జన్మించారు. ఆయన కుటుంబం 1936లో పాలస్తీనాకి వలస వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటీష్‌ యూదు దళాలతోను, 1948లో జరిగిన అరబ్ -ఇజ్రేలీ యుద్ధంలో ఇజ్రేలి రక్షక దళాలతోను కలిసి పని చేశారు. తరువాత హీబ్రూ సాహిత్యంపై కృషి చేశారు. కవిత్వంతో పాటు నవలలు, కథలు కూడా రచించారు. ఆయన రచనలు 37 భాషల్లోకి అనువాదమయ్యాయి. జెరూసలెంలో నివసించిన అమిచా 25, సెప్టెంబర్ , 2000న కాన్సెర్ తో మరణించారు. ప్రేమా, పరిత్యాగం ప్రధాన ఇతివృత్తాలుగా అమిచా కవిత్వ రచన సాగినప్పటికీ, రాజకీయ, చారిత్రక, సామాజిక సమస్యలపై కూడా అమిచా దృష్టి సారించారు. ఆధునిక ప్రేమకవిత్వానికి అమిచా చిరునామాగా మారినప్పటికీ, మానవ జీవన గమనంలోని అన్ని ఇతివృత్తాలను ఆయన సహజంగా, సరళశైలిలో అక్షరీకరించారు. హీబ్రూ భాష అప్పటిదాకా ప్రాచీన గ్రంధాలకే పరిమితమైన పరిస్థితి నుంచి దానిని యూదు ప్రజల మత, సాంస్కృతిక, రాజకీయ అవసరాల మేరకు సరళీకరించి, జన సామాన్యంలో ఆ భాషకు ప్రాచుర్యం కల్పించడంలో అమిచా కృషి ఎన్నదగినది. అమిచా కవితల్లో కొన్నింటికి తెలుగు అనువాదమిది.

నా పడక మీదే మరణించాలన్నది నా కోరిక

గిల్గాల్ నుంచి బయలుదేరిన సైన్యం
రాత్రంతా ప్రయాణించి మృత్యుక్షేత్రానికి చేరుకుంది, అంతే..
పడుగు పేకల యుద్ధభూమిలొ శవాలు దొర్లుతున్నాయి
అయినా, నా పడక మీదే మరణించాలన్నది నా కోరిక
ట్యాంకులో పగుళ్ళలాగా రాక్షసంగా వాళ్ళ కళ్లు
నేనెప్పుడూ కొద్దిమందినే, వాళ్లు మాత్రం చాలా మందే...
నేను జవాబు చెప్పే తీరాలి, వాళ్లు నా తలని ప్రశ్నలతో హింసిస్తారు
అయినా, నా పడక మీదే మరణించాలన్నది నా కోరిక
గిబియోన్‌ ఆకాశంలో సూర్యుడు నిశ్చలంగా ఉన్నాడు,
ఎప్పట్లాగే యుద్ధపిపాసుల్ని ఎండ రెచ్చగొడుతోంది
రక్తమోడిన నా భార్యని నేను చూడలేక పోవచ్చు
అయినా, నా పడక మీదే మరణించాలన్నది నా కోరిక
శామ్‌సన్‌, అతని బలమంతా నల్లని పొడవైన జుట్టులోనే ఉంది
నన్ను అమరుణ్ణి చేయగానే వాళ్ళు నాకు శిరోముండనం చేశారు
ప్రతిఘటించడాన్ని నిర్బంధంగా వాళ్ళు నాకు నేర్పారు
అయినా, నా పడక మీదే మరణించాలన్నది నా కోరిక
ఎక్కడా చోటు లేకపోతే సింహపు గుహలోనైనా
నువ్వు అందంగా జీవించగలవు
ఏకాకిగా చావడానిక్కూడా నేను జంకను
అయినా, నా పడక మీదే మరణించాలన్నది నా కోరిక

చరిత్ర పునరావృతమవుతుందో, లేదో నాకు తెలీదు
చరిత్ర పునరావృతమవుతుందో, లేదో నాకు తెలీదు
నాకు తెలిసినంత వరకు నువ్వు మాత్రం పునరావృతం కావు
నగరం రెండుగా చీలడం గుర్తుంది
యూదులు, అరబ్బులుగా మాత్రమే కాదు
మనం కలిసున్నప్పుడే
నువ్వూ, నేనుగా కూడా నగరం చీలిపోయింది

ప్రమాదాల పూర్ణగర్భాన్ని మనమే పుట్టించాం
మంచుతో ఉష్ణవాసాన్ని నిర్మించుకున్న ఉత్తర ప్రాంతవాసుల్లాగా
మృత్యుశీతల యుద్ధహర్మ్యాన్ని మనమే నిర్మించుకున్నాం
నగరం పునస్సంగమించింది
కానీ అక్కడ మనమిద్దరం కలిసి లేము
ఇప్పుడు నాకు బాగా తెలుసు
చరిత్ర పునరావృతం కాదని
నువ్వు పునరావృతం కావని నాకిది వరకే తెలిసినట్టు!

పర్యాటకులు
వాళ్ళనించి కేవలం సంతాపాన్నే పొందగలం
'హోలోకాస్ట్‌' స్మృతిచిహ్నం దగ్గర
వాళ్ళు బాసినపట్టు వేసుక్కూర్చుంటారు
'వెయిలింగ్‌ వాల్ దగ్గర విషణ్ణ వదనాలతో కనిపిస్తారు
ఆ తరువాత, హోటల్ గదుల్లోని భారీ కర్టెన్ల వెనుక
వాళ్ళు పగలబడి నవ్వుతారు
రాచెల్ , హెర్త్జ్ల్ ల సమాధుల వద్ద వాళ్ళు
మన అమరవీరుల విగ్రహాలతో కలిసి ఫోటోలు దిగుతారు
మన యువకుల్ని చూసి లోలోపలే కుళ్ళుకుంటారు
మన అందమైన యువతుల వెంటపడి చొంగకార్చుకుంటారు
చల్లని నీలి స్నానాల గదుల్లో
త్వరగా త్వరగా తమ లోదుస్తుల్ని ఆరబెట్టుకుంటారు

బరువైన రెండు సంచుల్ని నేలమీద పక్కనే పెట్టుకుని
ఒకనాడు నేను డేవిడ్స్ టవర్ దగ్గర మెట్లమీద కూర్చుని ఉన్నాను
అక్కడికి కొంత దూరంలో తన పర్యాటకులతో కలిసి ఒక గైడ్‌ నిలుచున్నాడు
నా వంక వేలుపెట్టి చూపుతూ,
'అక్కడ రెండు సంచులతో ఒక మనిషి కూర్చున్నాడు, కనిపిస్తున్నాడా...
అతని తలకి కుడివైపున రోమన్ల కాలం నాటి కమానొకటుంది చూడండి' అంటున్నాడు
'అయ్యో అతనెళ్ళిపోతున్నాడు' ఆందోళనగా చెబుతున్నాడు
కానీ, నాకు మాత్రం,
'అక్కడొక రోమన్ల కాలంనాటి కమానుంది చూశారా, అది ముఖ్యం కాదు,
దాని పక్కనే ఎడమవైపున, కొంచెం కిందుగా, తన కుటుంబం కోసం
పళ్ళూ, కూరగాయలూ తీసుకువెళుతూ,
కాస్త సేదతీరడానికి అక్కడే కూర్చున్న మనిషిని చూడండి...' అని
ఆ గైడ్‌ చెప్పగలిగినప్పుడే
ఈ దేశానికి విముక్తి దొరుకుతుందనిపించింది.

-పసుపులేటి గీత